దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు? పూజ విధానం ఏంటి?
దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని శరణువేడుతూ ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈఆచారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆయుధ పూజనే అస్త్ర పూజగా పిలుస్తారు.కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేక పోటిలు నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే అస్త్ర పూజను పురస్కరించుకుని సరస్వతీ దేవి పూజ చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఈపూజను ‘గోలు’అంటారు. ఈరోజున అక్కడ బొమ్మల కొలువు నిర్వహిస్తారు.
చెడుపై మంచి విజయాన్ని గుర్తుగా..
చెడుపై మంచి విజయానికి గుర్తుగా హిందువులు అస్త్ర పూజను నిర్వహిస్తారు. రావణ వధకు ముందు శ్రీరాముడు కూడా ఆయుధ పూజ నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.దుర్గాష్టమి రోజు దుర్గమ్మను శరణువేడుతూ ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. ఈరోజున రైతులు కొడవలి , నాగలి, పనిముట్లకు, వివిధ వృత్తుల వారు తమ వస్తువులకు పసుపు,కుంకుమ అద్ది దేవతలతో సమానంగా ఆరాధించి పూజిస్తారు.ఇలా చేస్తే శత్ర పీడ,బాధలు దరిచేరవని భక్తుల నమ్మకం. అస్త్ర పూజకు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి విశేషాలను తెలుసుకుందాం!
పాండవుల అస్త్ర పూజ..
పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు జమ్మిచెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచినట్లు పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాక అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్ళే ముందు ఆయుధ పూజ నిర్వహించినట్లు పురాణా పండితులు చెబుతుంటారు.శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకునేందుకు పాండవులు ఆయుధ పూజ చేశారని భక్తుల నమ్మకం. ఇదే రోజున దుర్గాదేవి.. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించినట్లు.. చెడుపై మంచి విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకోవడం హిందువుల సంప్రదాయంగా వస్తోంది.
ఓందం దర్గాయైనమ: మంత్రం పఠించాలి..
దుర్గాష్టమి రోజున ధ్యానం చేసిన తర్వాత అమ్మవారికి పూజలు చేయాలి.అనంతరం ఓం దుం దుర్గాయైనమ: మంత్రాన్ని పఠిస్తే శుభం జరుగుతుందని పురాణా పండితులు చెబుతుంటారు. కోఠి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని స్మరిస్తూ.. శత్రుబాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.ఈమంత్రంతో పాటు లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆతర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజలు చేయాలి.
ఆయుధ పూజ విధానం…
ఆయుధ పూజను ప్రధానంగా కర్ణాటక , తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతిఒక్కరూ తమకు జీవనోపాధి కల్పించే వస్తువులన్నింటిని అమ్మవారి ముందు ఉంచి పూజలు చేస్తారు. పూజకు ముందు ఇల్లు,దుకాణం , కార్యాలయాలు శుభ్రం చేసి తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు.విద్యార్థులు తమ పుస్తకాలను దేవి ముందు ఉంచి పూజిస్తారు.మామిడి ఆకులు , అరటి ఆకులతో అలంకరించి , ధూపం_దీపంతో శుభం జరగాలని దుర్గాదేవిని వేడుకుంటారు.