Journalism:
జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన గొప్ప సాధన. అలాంటి కఠినమైన మార్గంలో 37 సంవత్సరాలపాటు నిలకడగా సాగడం అంటే సాధారణ విషయం కాదు. అది నిబద్ధత, నైపుణ్యం, ధైర్యం, విలువల పట్ల అచంచలమైన విశ్వాసం కలయిక. ఈ లక్షణాలన్నింటినీ సమపాళ్లలో కలిగిన వ్యక్తి ఆర్. దిలీప్ రెడ్డి.సాక్షి జర్నలిజం స్కూల్ లో ఆయన నేర్పిన మెలుకువలు నా లాంటి ఎంతోమంది యువ జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
క్రైమ్ రిపోర్టర్‌గా తన జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించిన దిలీప్ రెడ్డి, తన కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు, ఎదుర్కొన్నారు. అయితే ఆయనకు వెనక్కి తగ్గడం అనే మాట తెలియదు. నిజం కోసం పోరాడటమే తన ధ్యేయంగా భావించి, ప్రతి క్షణాన్ని వృత్తి నిబద్ధతతో గడిపారు. కేవలం వార్తలు రాసే పాత్రికేయుడిగా కాకుండా, సమాజం ముందుకు వెళ్లే దిశలో ఒక మార్గదర్శకుడిగా ఎదిగారు.
ఆయన పనిచేసిన సంస్థల జాబితానే ఆయన ప్రతిభకు నిదర్శనం. ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ పత్రికల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎడిటర్ వంటి ఉన్నత స్థానాలకు ఎదిగారు. టెలివిజన్ రంగంలో కూడా మేనేజింగ్ ఎడిటర్‌గా తనదైన ముద్ర వేశారు. ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే People’s Pulse సంస్థలో డైరెక్టర్‌గా, Politikos సంస్థలో ప్రెసిడెంట్ & మేనేజింగ్ ఎడిటర్‌గా, అలాగే వెలుగు పత్రిక ఎడిటర్‌గా సేవలందించారు.
జర్నలిజం వృత్తిలో ఉన్నప్పుడే ఆయనకు మరో కీలక బాధ్యత లభించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ (RTI)గా ఐదేళ్లు సేవలు అందించడం. 2005 నుంచి 2010 వరకు ఈ బాధ్యతలో ఉన్నప్పుడు, ఆయన కేవలం ఒక అధికారిగా కాకుండా ప్రజలకు సమాచార హక్కు ప్రాముఖ్యతను తెలియజేసే ప్రజోద్యమకారుడిగా మారారు. రాష్ట్రం మొత్తం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ 1,300కి పైగా సమావేశాల్లో పాల్గొని, RTI చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కాలంలో ఆయన చేసిన సేవలు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి.
దిలీప్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో మరో ముఖ్య కోణం విద్యా రంగంలో ఆయన చేసిన సేవలు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ఇన్స్టిట్యూట్, పోలీస్ అకాడమీ, జ్యుడీషియల్ అకాడమీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తూ, కొత్త తరానికి విలువలతో కూడిన జర్నలిజం పాఠాలు బోధిస్తున్నారు. యువ పాత్రికేయులకు ఆయన మార్గనిర్దేశం ఎంతో విలువైనది.
పర్యావరణ పరిరక్షణలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. Green’s Alliance for Conservation of Eastern Ghats (GrACE) సంస్థకు 2011 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతూ, తూర్పు కనుమల సంరక్షణ కోసం కీలకమైన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో వెలువడిన Eastern Ghats: An Environmental Outlook నివేదిక అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల గుర్తింపు పొందడం ఆయన కృషికి ప్రతిఫలంగా నిలిచింది.
అంతేకాకుండా, Council for Green Revolution (CGR) ద్వారా పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనేక సంస్థల నుంచి అవార్డులు అందుకోవడం ఆయన సేవలకు నిదర్శనం.
దిలీప్ రెడ్డి గారి జర్నీ కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు. అది విలువలతో కూడిన జర్నలిజానికి ఒక మార్గదర్శకం. ఈ రోజుల్లో మీడియా రంగం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వేళ, ఆయనలాంటి సీనియర్ జర్నలిస్టుల అనుభవం, మార్గనిర్దేశం ఎంతో అవసరం. నిజాయితీ, నిష్పాక్షికత, ప్రజాహితం అనే మూల్యాలను ఆయన తన వృత్తిలో పాటించిన తీరు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తుంది.
జర్నలిజం అంటే కేవలం వార్తల సేకరణ కాదు… అది సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం. ఆ బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని, తన 37 ఏళ్ల ప్రయాణంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగిన ఆర్. దిలీప్ రెడ్డి గారు నిజంగా ఒక ‘వార్తల యోధుడు’. ఆయన ప్రయాణం ఇంకా కొనసాగాలని, మరిన్ని తరాలకు స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ…
*అమరవాజీ నాగరాజు*

