కామిక ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Kamikaekadashi: ఆషాడ మాసంలో కృష్ణ పక్ష  ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో భక్తులు దీనిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు  శ్రీ హరికి తులసి ఆకులతో పూజ చేయటం, వెన్న దానం చేయడం వలన మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

కామిక ఏకాదశి రోజున శ్రీ హరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా.. కేదార్ నాధుని దర్శనం కన్నా.. గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలం ఎక్కువని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశీ రోజు పాలు ఇచ్చే గోవును దూడ గ్రాసములతో కలిపి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారని ప్రతీతి. 

ఇక కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయం చేసిన వారి కన్నా గొప్పవారని.. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగారం చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారని పురాణ పండితులు చెబుతారు.

ఈ ఏకాదశి రోజున తులసి ఆకుతో శ్రీహరిని  ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువని భక్తులు నమ్ముతారు. అంతేకాక లేత తులసీ ఆకులతో మహావిష్ణువును ఆరాధన చేస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయని  భావిస్తారు. ఈ రోజున శ్రీ కృష్ణుని నువ్వుల నూనె నీతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్య లోకంలో నివసించే అర్హత కలుగుతారని పురాణాలు చెబుతున్నాయి.