Nancharaiah merugumala senior journalist:
షాబానూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయడానికి నాటి రాజీవ్ గాంధీ సర్కారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి 1986లో రాజీనామా చేశారు ప్రగతిశీల, సంస్కరణవాద ముస్లిం నేత ఆరిఫ్ మహ్మద్ ఖాన్. కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ అప్పుడు ముస్లిం ఛాందసవాదుల మాట విని అభివృద్ధి నిరోధకమైన ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లును చట్టంగా చేయించారు. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ బులందశహర్ కు చెందిన ఆరిఫ్ దీనికి నిరసనగా కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచీ ముస్లిం మతశక్తుల చేతుల్లో రాజీవ్ బందీ అయ్యారు. తర్వాత జనతాదళ్ లో వీపీ సింగ్ తోపాటు చేరిన ఆరిఫ్ ఏడాదిపాటు వీపీ మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన కాంగ్రెస్ తో రాజకీయ ప్రయాణం ప్రారంభించి అనేక పార్టీలతో కలిసి ప్రయాణించి, చివరికి బీజేపీలో చేరి 2019 నుంచీ కేరళ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ మార్కు’ సెక్కులరిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఆరిఫ్ బీజేపీతో కలిసి ఉంటూ దాన్ని లౌకిక మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాం నాటి ‘సర్కారీ ముస్లిం’ నేతలతో పోల్చితే ఆయన అత్యంత నిజాయితీపరుడు. ముస్లిం ప్రజానీకం ప్రగతిపై ఆయన అంకితభావంతో పనిచేస్తారు. ఇస్లాంపై సమగ్ర అవగాహన ఉన్న ఆరిఫ్..‘మధ్యలో వచ్చిన ముమ్మారు తలాక్’ పద్ధతి పోవాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. తలాక్ రద్దు చట్టం 2019లో అమల్లోకి వచ్చాక ముస్లింలలో విడాకుల సంఖ్య 90 శాతం కన్నా ఎక్కువ తగ్గిపోయింది. కోట్లాది ముస్లిం స్త్రీలు, పిల్లల భవిష్యత్తు ఇక భద్రం,’ అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 71 ఏళ్ల ఆరిఫ్ కాన్పూర్, బహ్రాయిచ్ నుంచి ఇప్పటికి నాలుగుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇస్లాం లోపల ముస్లింల ద్వారానే సంస్కరణలు, మంచి మార్పులు రావాలనేది ఆరిఫ్ ఖాన్ అభిప్రాయం. బీజేపీతో, నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ భారత ముస్లిం సమాజానికి మేలు జరిగేలా చూసే పనిలో నిమగ్నమయ్యారాయన.
బీజేపీతో తలపడుతున్నట్టు కనిపిస్తూనే హిందుత్వతో ఒవైసీ లోపాయికారి అవగాహన..
ఆరిఫ్ సాహబ్ కు పూర్తి విరుద్ధమైన ముస్లిం నాయకుడు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, హైదరాబాద్ ఎంపీ ‘బారిస్టర్’ అసదుద్దీన్ ఒవైసీ. ఇస్లాంపై కేరళ గవర్నర్ గారికి ఉన్న అవగాహన, లోతైన దృష్టి అసద్ భాయ్ కు లేవుగాని ఆయన తండ్రి ‘సాలార్’ సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ తర్వాత భారత ముస్లింల నేతగా అసద్ ఒవైసీ ఇటీవల పేరు సంపాదించారు. బీజేపీ, ఆరెసెస్ తదితర సంఘ్ పరివార్ సంస్థలను, హిందుత్వ పోకడలను బాహాటంగా విమర్శిస్తూ వాటిపై ‘నిప్పులు’ చెరిగే అసదుద్దీన్ లోపాయికారిగా ఇవే సంస్థలతో అవగాహనతో నడుచుకోవడం ఆయన రాజకీయ ప్రావీణ్యం. హిందుత్వ వ్యతిరేక నినాదాలతో సాధ్యమైన చోట్ల గెలవడం, వీలులేని నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరే ఓటును మజ్లిస్ అభ్యర్థులు చీల్చేలా చూసుకోవడం అసదుద్దీన్ ఒవైసీపై నేడున్న బాధ్యత. 53 ఏళ్ల ఒవైసీని ఆయన లండన్ లా చదువు కారణంగా మజ్లిస్ అభిమానులు ‘బారిస్టర్ ఒవైసీ’ అని పిలుచుకుంటారు. పైన చెప్పిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మాదిరిగా బీజేపీ సహా హిందుత్వ సంస్థలతో బాహాటంగా సహజీవనం చేయడం ముస్లింలకు ఒక రకమైన సేవచేయడమే. అలాగే, పైకి బీజేపీని, మోదీపై నిప్పులు చెరుగుతూ పరోక్షంగా హిందుత్వ శక్తులకు సాయపడడం అసదుద్దీన్ ఒవైసీ అనుసరించే మరో రకం ముస్లిం సేవా విధానం. కొన్నేళ్లకు దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక రాజకీయపక్షంగా ఎంఐఎం ఎదిగిపోవాలని బీజేపీ అగ్రనేతలు కోరుకుంటున్నారు. అందుకేనేమో మరి, ‘బీజేపీ అభిమానులు పోలింగ్ బూతులోకి వెళ్లి–జై బజరంగ బలీ–అని నినదించాలి,’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇస్తే, ‘ఓటేయడానికి పోలింగు కేంద్రానికి వెళ్లే ముస్లింలు–అల్లాహ్ హో అక్బర్–అని అరవాలి,’ అని అసద్ ఒవైసీ కోరడాన్ని బట్టి చూస్తే ఈ రెండు హిందూ, ముస్లిం పార్టీల (బీజేపీ, ఎంఐఎం) మధ్య చక్కటి రహస్య అవగాహన ఉందనిపిస్తుంది. ఈ లెక్కన భారతీయ ముస్లింల ప్రగతి, సంక్షేమం కోసం దేÔ¶ ంలో మరో వంద మంది ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌లు, అసదుద్దీన్ ఒవైసీలు తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోదీ హయాంలో భారతదేశంలో ముస్లింల భద్రత గురించి భయపడుతున్న ముస్లిం ఆలోచనపరులు, బుద్ధిజీవులు ఇక నుంచైనా ఆరిఫ్ మహ్మద్ ఖాన్, అసదుద్దీన్ ఒవైసీల మార్గాల్లో పయనిస్తే దేశంలో శాంతి, భద్రతలు, మతసామరస్యం బలోపేతమవుతాయి.