Jagansharmila: ప్రియాంక, రాహుల్‌ను చూసి జగన్, షర్మిల కొంతైనా నేర్చుకోవద్దా..?

Nancharaiha merugumala (Senior journalist): 

గురువారం(ఈరోజు)  ‘ఈనాడు’ మొదటి పేజీ కింది వార్త ‘తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్‌’ అనే వార్త. దాని కిందే ‘జగనన్నా..ఇంత అన్యాయమా!’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రెండో రాజకీయ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వైఎస్‌ షర్మిలమ్మ ఆవేదనతో కూడిన లేఖ వార్త. ఇదే పేపరు లోపలి పేజీలో ‘రాజకీయాల్లో నాకు 35 ఏళ్ల అనుభవం’ అంటూ భారత జాతీయ ప్రథమ రాజకీయ కుటుంబంలో ఆడబిడ్డ ప్రియాంకా గాంధీ వాడ్రా చెప్పిన మాటలతో మరో వార్త. కేరళ వయనాడ్‌ నుంచి వచ్చిన ఈ వార్తలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియంక 52 సంవత్సరాల వయసులో తొలిసారి లోక్‌సభ స్థానంలో పోటీకి నామినేషన్‌ నామినేషన్‌ వేస్తుండగా పక్కన 54 ఏళ్ల రాహుల్‌ గాంధీ, వెనుక సీటులో తల్లి సోనియా గాంధీ (78) కూర్చుని ఉన్నట్టు ఫోటో ప్రచురించారు. వైఎస్, సోనియా–రాహుల్‌ కుటుంబాలు రెండూ దేవుణ్ని నమ్మేవే. దివంగత ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇద్దరు పిల్లలు జగన్‌ (52), షర్మిల (51) ఇద్దరికీ పెళ్లీడు, పెళ్లయిన పిల్లలు ఉన్నారు. రెండు కుటుంబాలూ హిందూ పురాణాల్లోని మంచి మాటలతోపాటు దేవుని వాక్యాలను విశ్వసించేవే..!

ఈ రెండు వార్తలు చదివాక––ఈ రెండు కుటుంబాల మధ్య ఎంత తేడా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. చెల్లి కోసం ముస్లింలు, క్రైస్తవులు మెజారిటీగా ఉన్న వయనాడ్‌ పార్లమెంటు సీటుకు రాహుల్‌ రాజీనామా చేసి ఆమెతో దగ్గరుండి మరీ నామాంకన పత్రాలను బుధవారం దిల్లీ నుంచి కాల్పేట వచ్చి దాఖలు చేయిస్తే, కొన్ని కోట్ల విలువైన షేర్ల కోసం జగన్‌ ఎన్‌సీఎల్‌టీకి తన చెల్లెలు షర్మిలపై ఫిర్యాదు చేయడం తెలుగునాట క్షీణిస్తున్న కుటుంబ విలువలకు, తోబుట్టువుల మధ్య ఆవిరవుతున్న, ఇంకా చెప్పాలంటే చచ్చిపోతున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమా? అనే అనుమానం చాలా మందికి వస్తోంది. ప్రభువు దయతో, వెంకన్న బాబు కరుణతో.. షర్మిల, జగన్‌ మధ్య మనస్పర్ధలు మరో ఐదేళ్లలో తొలగిపోతే…2029 పార్లమెంటు ఎన్నికల్లో కడపలో షర్మిలమ్మ పక్కన కూర్చుని జగన్‌ బాబు లోక్‌సభకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయించే అవకాశాలూ లేకపోలేదు. ఇదంతా నిజం అవ్వాలంటే షర్మిలమ్మ భర్త బ్రదర్ ఎం అనిల్ కుమార్ బంధువు కూడా అయిన రాజమండ్రి మాజీ ఎంపీ, హిందూ సువార్తీకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గారు ఇక నుంచి ‘మార్గదర్శి’ గోల పక్కన పెట్టి అన్నాచెల్లెళ్ల వివాదం పరిష్కారానికి ఇప్పుడు నుంచే ప్రయత్నాలు చేయకతప్పదు.

Optimized by Optimole