BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్ర‌మంత్రి బండిసంజ‌య్

Bandisanjay:   ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు కేంద్ర‌హొంశాఖ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈమేర‌కు మూసీ బాధితుల ప‌క్షాన శుక్ర‌వారం(ఈనెల‌25న‌)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంద‌న్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలనుకుంటోందని హెచ్చరించారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైందని.. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని వ్రుథా చేస్తోందని మండిప‌డ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే నానా తంటాలు పడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంద‌ని..ఖ‌జ‌నాలో డబ్బుల్లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని సంజ‌య్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో లక్షన్నర కోట్ల రూపాయల మేరకు అప్పు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గ చ‌ర్యగా అభివ‌ర్ణించారు. ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారని.. మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప మూసీ పరిస్థితి ఏ మాత్రం మారలేదని సంజ‌య్ వివ‌రించారు.

గత పాలకులు లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ‘మూసీ పునరుజ్జీవం’ పేరుతో మరో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండటం బాధాకరంగా ఉంద‌ని కేంద్ర‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంద‌ని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని.. నాబార్డ్ సంస్థ ఇచ్చిన ‘‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే’’ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేన‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున ల‌క్ష 29 వేల 599 అప్పు ఉండ‌గా.. జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువగా.. రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయని కేంద్ర‌మంత్రి వెల్ల‌డించారు.

వాస్తవానికి బీజేపీ పార్టీ ‘మూసీ ప్రక్షాళన’కు వ్యతిరేకం కానేకాదని సంజ‌య్ కుమార్ తేల్చిచెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆర్దిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మళ్లీ లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోందని స్ప‌ష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా బీజేపీ   వ్యతిరేకిస్తోందని.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన పార్టీ చేప‌ట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణుల‌కు కేంద్ర‌మంత్రి పిలుపునిచ్చారు.