Cult review: హింసకు హద్దేదీ…?

Movie review:

Newsminute24 | Pavan vootkur ✍🏽 

చిత్రం: కల్ట్ (#Cult)
నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: సందీప్ కాకరాల
సంగీతం: రవి బస్రూర్
సంభాషణలు: తరుణ్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
విడుదల తేదీ: అక్టోబర్ 30, 2026
రేటింగ్: 2/5

కథ:

గోవాలో ఓ మంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాడు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పార్టీకి మాయ (గాయత్రి భరద్వాజ్) కూడా వస్తుంది. అయితే ఎల్విన్‌తో ఆమెకు ఎదురైన వివాదం క్రమంగా తీవ్రరూపం దాలుస్తుంది. ఈ క్రమంలో పార్టీలో ప్రాణాలతో చెలగాటమాడే ప్రమాదకరమైన గేమ్ ప్రారంభమవుతుంది. ఆటలో ఓడిన వారికి మరణమే శిక్షగా నిర్ణయిస్తారు. ఎవరూ బయటకు వెళ్లకుండా పబ్ తలుపులకు ఆర్డీఎక్స్ బాంబులు అమర్చడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతుంది. ఈ సంక్షోభంలో తన కుమారుడిని కాపాడుకునేందుకు మంత్రి పోలీస్ అధికారి డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్)ను రంగంలోకి దించుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వందలాది మంది ప్రాణాలను సంకల్ప్ ఎలా కాపాడాడు? ఎల్విన్ ఆటకు ఎలా ముగింపు పలికాడు? అన్నదే మిగతా కథ.

కథనం.. 

దర్శకుడిగా విశ్వక్ సేన్ ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. ఒకే రాత్రి.. ఒకే పబ్.. వందలాది మంది.. ప్రాణాంతకమైన ఆట.. ఇలాంటి నేపథ్యంతో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో దర్శకుడు తడబడ్డారు.

కథలో భావోద్వేగాలకు, పాత్రల స్వభావాలకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. హింస, రక్తపాతం, ప్రమాదకరమైన గేమ్స్ చుట్టూనే సన్నివేశాలు తిరుగుతుంటాయి. దాదాపు 150 మంది కొత్త నటీనటులతో భారీ స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ, ప్రేక్షకుడిని కథలోకి లాగడంలో సినిమా విఫలమైంది.

మొదటి అరగంటలో కథనం నెమ్మదిగా సాగుతుంది. డీఎస్పీ సంకల్ప్‌గా విశ్వక్ సేన్ తెరపైకి వచ్చే వరకు ఆసక్తికరమైన మలుపులు కనిపించవు. హీరో ఎంట్రీ తర్వాతైనా కథనం వేగం పుంజుకుంటుందని ఆశిస్తే, ఆ అంచనాలు పూర్తిగా అందుకోవు. హీరో, విలన్ మధ్య సంఘర్షణను బలంగా చూపించడంలోనూ దర్శకుడు విఫలమయ్యారు.

ద్వితీయార్థంలోనూ అదే నిరాశ!

సెకండాఫ్‌లోనూ హింసాత్మక సన్నివేశాలే ప్రధానంగా కనిపిస్తాయి. కథను ముందుకు నడిపించే బలమైన సంఘటనలు కొరవడటంతో ఆసక్తి తగ్గుతుంది. చివరి భాగంలో స్వలింగ సంపర్కుల నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌లో కొంత భావోద్వేగం కనిపించినప్పటికీ, అది సినిమా స్థాయిని పెంచేంత బలంగా లేదు. ఉత్కంఠ, భావోద్వేగం, కథనంలో పట్టుదల.. ఈ మూడింటి మధ్య సమతుల్యత లోపించింది.

నటీనటుల పనితీరు

సినిమాను  విశ్వక్ సేన్ తన భుజాలపై మోశారు. డీఎస్పీ సంకల్ప్ పాత్రలో తనదైన శైలిలో నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బలహీనమైన కథ, కథనాల కారణంగా ఆయన ప్రయత్నానికి తగిన ఫలితం దక్కలేదు.

గాయత్రి భరద్వాజ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తారక్ పొన్నప్ప తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్వక్ తర్వాత చెప్పుకోదగిన ప్రభావం చూపిన నటుడిగా కనిపిస్తారు. మురళీ శర్మ పాత్రకు సరైన పరిధి లేకపోయింది. మిగిలిన నటీనటులకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పరిమితంగానే దక్కింది.

సాంకేతిక విభాగాలు

సాంకేతికంగా చూస్తే రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కొన్ని సాధారణ సన్నివేశాలకు కూడా తన సంగీతంతో తీవ్రతను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి.

విశ్లేషణ

ప్రస్తుత తరానికి కొత్తదనం ఉన్న కథలు అందించాలనే ప్రయత్నం అభినందనీయం. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో జరిగే సంఘటనలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించడం ఆసక్తికరమైన ఆలోచన. కానీ కథలో బలం లేకుండా హింసను మాత్రమే నమ్ముకుంటే ప్రేక్షకుడిని మెప్పించడం కష్టమే. పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన మలుపులు ఉంటేనే ఇలాంటి కథలు ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయి. ఆ విషయంలో ‘కల్ట్’ నిరాశపరిచింది.

చివరిగా..

విశ్వక్ సేన్ దర్శకుడిగా చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. హింసాత్మక యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే కొందరికి మినహా, బలమైన కథను ఆశించే ప్రేక్షకులకు ‘కల్ట్’ నిరాశ కలిగించే అవకాశముంది. మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.

Newsminute24 రేటింగ్: 2/5

Optimized by Optimole