Telangana:
newsminute24/ pavan vootkur ✍🏽
ఢిల్లీ పర్యటనలో మంత్రి దామోదర రాజనర్సింహ, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య చెలరేగిన వివాదం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేను ఉద్దేశించి మంత్రి వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇండియా కూటమి ర్యాలీ కోసం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు బస చేసిన షాంగ్రిలా హోటల్ లాబీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఎదురుపడిన లక్ష్మీకాంతరావును ఉద్దేశించి మంత్రి దామోదర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
డీసీసీ పదవితో చిచ్చు..
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే వివాదానికి సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పదవి కోసం జహీరాబాద్‌కు చెందిన ఉజ్వల్‌రెడ్డి, పటాన్‌చెరుకు చెందిన కాటా సుధారాణి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్తో పాటు పలువురి మధ్య పోటీ నెలకొంది.
మంత్రి దామోదర ఆశీస్సులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మద్దతు ఉండటంతో ఉజ్వల్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో పాటు ఢిల్లీ పర్యటనలకు కూడా ఉజ్వల్‌రెడ్డి వెళ్లివచ్చారు.
గత ఏడాది నవంబర్‌లో మిగతా జిల్లాల డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం సంగారెడ్డి జిల్లాను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల జగ్గారెడ్డిని కొనసాగించింది.
షాకిచ్చిన అనూహ్య నిర్ణయం
డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆగస్టు నెలలో అధిష్ఠానం దూతలు జిల్లాకు వచ్చి పలువురు నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఉజ్వల్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది.
అయితే, సెప్టెంబర్ 19న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ అనూహ్య నిర్ణయం మంత్రితో పాటు జిల్లా ముఖ్య నేతలకు కూడా షాక్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి మద్దతు, ఆశీస్సులు లేకుండానే ఈ నియామకం ఎలా జరిగిందన్న చర్చ అప్పట్లోనే మొదలైంది.
అవమానంగా భావించిన ఎమ్మెల్యే
ఢిల్లీలో జరిగిన ఈ వివాదం రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. తనపై మంత్రి తీవ్ర పదజాలం ఉపయోగించడంపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
సహచర ఎమ్మెల్యేల సమక్షంలోనే తనను అవమానించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తన అనుచరులు, సహచర ఎమ్మెల్యేల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్ లాబీలో జరిగిన మొత్తం వ్యవహారంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో జుక్కల్ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది.
పట్టు సడలిందన్న భయం!
తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డికి సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి దక్కడం మంత్రి దామోదర రాజనర్సింహకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
జిల్లాపై తన పట్టు సడలిందన్న భావన మంత్రిలో ఏర్పడినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తనను నమ్ముకున్న నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురవడంతో పాటు, జిల్లా రాజకీయాలతో సంబంధం లేని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఈ నియామకంలో కీలకంగా వ్యవహరించడంపై కూడా మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేతల వ్యక్తిగత సిబ్బంది సహకారం, ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ఉన్న పరిచయాలు చంద్రశేఖర్‌రెడ్డి నియామకానికి దోహదపడ్డాయన్న ప్రచారం కూడా ఈ అసంతృప్తికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నియామకం చుట్టూ మొదలైన రాజకీయ పరిణామాలు చివరకు ఢిల్లీ వేదికగా వివాదానికి దారితీశాయి. జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
