మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభణకు మ్యుటేషన్లు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణమని.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న పరిష్కారమని ఆమె పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక చైనాలో వెలుగుచూసిన ‘నియోకోవ్‌’ వేరియంట్‌ పై స్పందిస్తూ.. ఇప్పటికైతే నియోకోవ్ వలన అంత ప్రమాదం లేదని ఆమె స్పష్టం చేశారు.