విశీ(వి.సాయివంశీ):
నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..!
‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా?
‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని సాధించిపెడతాయి’ అనే పద్ధతిని నూరిపోశాయి. కదా? కాదంటారా? యువతకు ఎన్ని ఆశలు.. ఎన్ని ఆకాంక్షలు.. ఎన్ని ఊహలు.. ఎన్ని కోరికలు.. అవన్నీ మార్కుల మూటల్లోనో, కొలువుల బాటలతోనో తీరతాయా? ఇంకేమీ లేదా? ఇవన్నీ ప్రశ్నించే ఒకానొక కుర్రాడి కథే ఈ సినిమా ‘ఏం చేస్తున్నావ్’.
అంశం మరీ సీరియస్ అంశంలా ఉందా? కంగారుపడొద్దు. ఈ సినిమా అచ్చమైన ప్రేమకథ. ఇంకా మాట్లాడితే, నాలుగు ప్రేమకథల సమాహారం. తల్లీకొడుకుల ప్రేమ, నాన్నాకొడుకుల ప్రేమ, ప్రేయసీ ప్రేమికుల ప్రేమ, ఆశయానికీ, దాన్ని సాధించిన అబ్బాయికీ మధ్య ప్రేమ. ఇన్ని ప్రేమలున్న అచ్చమైన ప్రేమ కథ ఇది.
ఉద్యోగం కోసం ఉరకలెత్తాలా? ఆశయం కోసం అడుగేయాలా అనే మీమాంసలోని ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అంశాలు ఈ కథ నిండా ఉన్నాయి. ఆ ఆశయం పేరు ‘సినిమా’. వెండితెర మీద తన కథలు ఓ వెలుగై వెలగాలని భావించే కుర్రాడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అందుకోసం ఏం చేశాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన మనుషులెవరు? వారితో అతనికి ఏర్పడ్డ బంధం ఏమిటనేది ఈ సినిమాలో చూడొచ్చు. అంతేనా?
మనకు పోలికలైనా, ఆశయాలైనా.. అన్నీ నాన్నల నుంచేగా రావాలన్నట్లు ఉంటుంది. ఈ సినిమాలో అందుకు భిన్నం. అమ్మను అమ్మలా కాక స్నేహితురాలిగా భావించే కొడుకు ఇందులో కనిపిస్తాడు. అమ్మలోని సినిమా ఆశ కొడుక్కి రావడం కనిపిస్తుంది. దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగుంటుంది. అమ్మగా ఆమని, కొడుకుగా విజయ్ చాలా బాగా కుదిరారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల ఆమని నటన చాలా సహజంగా అనిపిస్తుంది. తండ్రిగా చేసినాయన కూడా చాలా బాగా చేశారు. మరిన్ని పాత్రలు దొరికితే గొప్పగా రాణించే అవకాశం ఉన్న ఆర్టిస్టు. గోపీసుందర్ సంగీతంలోని పాటలు పాడుకునేలా హాయిగా ఉన్నాయి.
అన్నీ బాగానే.. బాగోనివేవీ లేవా? ఎందుకు లేవూ.. సినిమాను ఇంకా బాగా తీసి ఉండొచ్చు. ఈ ‘బాగా’కు నిజంగా నిర్వచనం లేదు కానీ, మరింత బాగా తీయొచ్చనే ఫీలింగ్ మాత్రం ఉంది. కథలో ఇంకొంత కామెడీ, కొన్ని హీరో ఎలివేటెడ్ సీన్లు పడి ఉంటే బాగుండేదనిపించింది. హీరో రాజ్‌కుమార్‌కు ఫ్రస్టేటెట్ యూత్ పాత్ర బాగా సూటైంది. మొదటి సినిమా అయినా నటనలో తడబాటు లేకుండా చూసుకున్నారు. ఎటొచ్చీ హీరోయిన్‌తో ఇంటిమసీ సన్నివేశాల్లో ఒకటి, రెండు చోట్ల ఇబ్బంది పడ్డట్లు అనిపించింది. ఇవి తప్ప మిగిలిన సాంతమూ.. హేమంతమే.
(సినిమా ETV WIN Streaming Appలో అందుబాటులో ఉంది.)