విశీ(సాయివంశీ):
పూర్వం మదురైని షణ్మగపాండియన్ అనే రాజు పాలిస్తున్నాడు. ఒకసారి ఉద్యానవనంలో ఉన్న సమయంలో తన భార్య జుట్టులోనుంచి సుగంధ పరిమళం ఆయన్ను తాకింది. కానీ ఆమె జుట్టుకు ఎటువంటి నూనె రాయలేదు. తలలో పూలు కూడా లేవు. దీంతో ‘స్త్రీ జుట్టులోనుంచి వచ్చే పరిమళం సహజమైనదా? వేరే కారణం వల్ల వస్తుందా’ అనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం చెప్తే వెయ్యి బంగారు నాణేలు ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఇందుకోసం చాలామంది ప్రయత్నించినా ఎవరూ సరైన సమాధానం అందించలేకపోయారు.
ధారుమి అనే ఓ పేద కవికి ఈ విషయం తెలిసింది. తన దరిద్రం తీరాలంటే ఆ వెయ్యి నాణేలు కావాలని, అందుకోసం ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషించాలని అనుకున్నాడు. కానీ ఎలా? ఎవరూ చెప్పలేని ఆ సమాధానం తనకెలా తెలుస్తుంది? ఇలాంటి ఆలోచనలో శివుణ్ని ధ్యానిస్తూ దు:ఖించగా, శివుడు ఓ కవి రూపంలో ఆయన వద్దకు వచ్చాడు. విషయం కనుక్కొని తాను సాయం చేస్తానని అన్నాడు. ఒక మర్మమైన పద్యాన్ని అతనికి చెప్పి, అందులోనే ఆ ప్రశ్నకు సమాధానం ఉందని వివరించాడు.
ధారుమి రాజసభకు వెళ్లి ఆ పద్యాన్ని అప్పజెప్పాడు. అది విని రాజు సంతోషించాడు. అతనికి బహుమానం ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో ఆగమంటూ ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు నక్కీరన్‌ది. ఆయన షణ్మగపాండియన్ ఆస్థాన కవి. ధారుమి చెప్పిన పద్యంలో తప్పు ఉందని ఆయన వాదించాడు. కవి రూపంలో ఉన్న శివుడు ఆ మాటతో కలతచెందాడు. ఆ పద్యం శ్రేష్ఠమైనదని, అందులో ఎటువంటి తప్పూ లేదని వాదించాడు. నక్కీరన్ ఒప్పుకోలేదు. తప్పు తప్పే అన్నాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో శివుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్యంలో ఏ తప్పూ లేదని, కాదంటే బూడిద చేస్తానని అంటూ తన మూడో కన్ను చూపించాడు. అయినా నక్కీరన్ బెదరలేదు. వచ్చింది శివుడే అయినా, మూడో కన్ను తెరిచి నన్ను భస్మం చేసినా సరే తప్పు తప్పే అని నిర్భయంగా చెప్పాడు.
దీంతో శివుడు తన నిజరూపాన్ని చూపించాడు. నక్కీరన్ చెప్పింది సరైన విషయమేనని, అతని పాండిత్యాన్ని పరీక్షించేందుకే ఇలా వాదించానని చెప్పాడు. భాషపై నక్కీరన్‌కి ఉన్న ప్రేమను అభినందించాడు. శివుడి ఆదేశం ప్రకారం ఆ వెయ్యి నాణేలను ధారుమికి అందించాడు రాజు.
(ఏడో శతాబ్దానికి చెందిన శివభక్తుడు పరంజ్యోతి రాసిన ‘తిరువిళైయాడల్ పురాణం’లో ఒక కథ)
నక్కీరన్ సంగమ కాలపు తమిళ కవి. ఆయన జీవితకాలంపై స్పష్టత లేదు. మూడో శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్య ఏదో ఒక కాలంలో ఆయన జీవించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి(మురుగన్)పై ఆయన రాసిన ‘తిరుమురుగాట్రుపాట్టై’(మురుగన్‌ను చేరే మార్గం) పాటలు తమిళ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆయన రాసిన ‘నెడునల్‌వాడై’(ఉత్తరం దిక్కు నుంచి బలమైన గాలి) కవిత్వ సంకలనం తమిళ సంగమ కవిత్వంలో విశేషంగా నిలిచింది.