Budget 2024: జోడెద్దుల మాదిరిగా అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు బడ్జెట్ ప్రతీకగా ఉందన్న ఆయన.. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50 కోట్ల రూపాయలను మౌలిక రంగాల అభివ్రుద్ధికి కేటాయించడం గొప్ప విషయమన్నారు. సామాన్యుడి మొదలు.. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. కోటి కుటుంబాలకుపైగాట ఇంటి అవసరాలను తీర్చేలా, 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్ లో ప్రతిపాదించడం సంతోషంగా ఉందని తెలిపారు.దేశంపట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని బండి సంజయ్ కొనియాడారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1 లక్షా 50 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించడం ద్వారా రైతులపట్ల, వ్యవసాయం రంగంపట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా బడ్జెట్ నిలిచిందని సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలకు పుట్టిల్లుగా ఉన్న తెలంగాణకు ఈబడ్జెట్ తో ఎంతో మేలు జరగబోతోందన్నారు. విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి పెద్దపీట వేయడమే కాక.. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయడం గొప్ప విషయమని అన్నారు. 4 కోట్ల మందికి మేలు జరిగేలా ట్యాక్స్స్ శ్లాబులను రూపొందించినట్లు సంజయ్ వివరించారు.
బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అర్ధరహితం..
బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికార, ప్రతిపక్ష నేతల మాటలు అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు. దేశంలో తెలంగాణసహా వెనుకబడిన 150 జిల్లాల అభివ్రుద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోందని.. శాఖల వారీగా బడ్జెట్ లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పొందుపర్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమైతే…దానికి వంతపాడింది కేసీఆర్ అనే విషయం వాస్తవం కాదా? దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేన మాట వాస్తవం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు.కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తీరుతుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏ సాధించారో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.