Gurramseetharamulu:
ఆ నెత్తుటి మడుగుకు యాభై ఏళ్ళు నిండెనో
సాయుధ పోరులో సాగిన త్యాగాల దారిలో
ఒరిగిన అమరుల కథలు కావాలిప్పుడు
జార్జ్ ఉంటే ఆయనకి ఇప్పుడు డెబ్భై ఏడు ఏళ్ళు వచ్చి ఉండేవి.
ఆయనే ఉంటే చీలికలు పేలికలు అయిపోయిన ఎర్రజెండాలు దుస్థితి ని చూసి శ్రీ శ్రీ లా మతి చలించి ఉండేవాడు.
గొప్ప ప్రత్యామ్నాయ రాజకీయాలు కలగన్న జార్జ్ దూరం అయి అప్పుడే యాభై రెండు ఏళ్ళ అవుతోంది.
ఆయన పుట్టేనాటికి ఈ దేశం వలస వాద బంధీఖానలో ఉంది. ఆయన పెరిగి పెద్దవాడు అయ్యాక కూడా నోళ్లు తెరిచిన జైళ్ల క్రూరత్వాన్ని చూసే ఉన్నాడు.
ఇప్పుడు ప్రతొక్క నాయకుడు తమ జెండా నే జార్జ్ కి వెలుగు దారి అంటూ లెక్కలు పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్య ఒక నాయకుడు జార్జ్ కి రాజకీయ దిశను నేనే ఇచ్చాను అనేదాకా పోయాడు.
పాపం జార్జ్ వెలిగే తార అని వాళ్లకు తెలియక కాదు. ఒకరి వెలుగు ఆయనకు అవసరం లేదు కారణం.ఆయన స్వయం గా ప్రకాశించే నక్షత్రం.
జార్జ్ పోయే నాటికి ఎర్రజెండా పందిమ్మిది వందల అరవై నాలుగు నాటికి రెండు ముక్కలు , అరవై తొమ్మిది నాటికి మరో ఆరొన్నక్క ముక్కలై ఏ ముక్క ఎటుపోవాలో తెలియని గందరగోళం లో ఉంది.
పాతికేళ్ల పిల్లవాడు ఏముక్క సరైందో అని వెతుకులాట లో ఉన్నాడు. కానీ ఒక బలమైన విప్లవ నిర్మాణం అవసరం అనే దృడమైన సంకల్పం మాత్రం ఆయనలో ఉంది. విశ్వవిద్యాలయాలు విప్లవ ఖార్ఖానాలు గా వెలుగుతున్న దశలో ఆయన వెలిగే నిప్పుకు పెట్రోల్ అవుతున్న దశ.
ఇవి బూర్జువా చదువులు ఇవి మనకు బువ్వ పెట్టవు అని చిలక పలుకులు పలికే చానా మంది పిల్లలు ఇప్పుడు అమెరికా లో దర్జాగా చదువుకుంటున్నారు. అప్పుడప్పుడూ సెలవుల్లో పోయి మనవళ్ల మనవరాళ్ల డైపర్లు మార్చి వచ్చి ఇక్కడ సామ్రాజ్య వాద వ్యతిరేక నినాదాలు ఇస్తూ ఉంటారు. యాదాడికి ఒక సంకలన గుడ్డు పెట్టి అకాడమీ ముందు కాట్ వాక్ చేసే ఉభయ చర కవులూ విప్లవ కారులూ ఉంటారు.
హక్కుల మర్మాలు రాజ్యానికి రాజ్య క్రూరత్వం సమాజానికీ చెప్పే విదూషకులూ ఉంటారు.
ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వాఁకింగ్ సూత్రదారుల చాలా మంది పిల్లలు భద్రమైన డాలర్ల జీవితం లో ఖరీదైన ఎన్జీవో లు నడుపుతూ ఉంటారు. సెమి ఫ్యూడల్ సెమీ కలోనియల్ అంటూ బలమైన వాగ్ధాటి తో పెటీ బూర్జువా ,కాంప్రడార్ సెక్షన్ ల గురించి ఖంటనరాలు చిట్లే లా అరుస్తూ ఉంటారు. ఇంటికి పోయిన మఖమల్ గుడ్డల్లో చెమటను ఆరబెట్టుకుంటారు.
యాభై రెండేళ్ళ లో జార్జ్ మనకు ఏం ఇచ్చాడు.
అధ్యయనం పోరాటం జమిలిగా జరగాలి అన్నాడు. విద్యలో వివేచన లో విలువలతో బ్రతకాలి అని చెప్పాడు అన్నటికన్నా ముఖ్యంగా అతను అసాధారణ ప్రతిభావంతుడు.
విచక్షణ తో కూడిన ఆగ్రహ ప్రకటన ఆయనది. వివేచన తో కూడిన రాజకీయాలు నడిపిన నిక్కచ్చి తనం ఆయన సొంతం. ఆయన కార్యాచరణ ఆగ్రహం వెనక ముప్పును రాజ్యం ముందుగానే పసిగట్టింది.
ఊరికొక పుట్టగొడుగులా విగ్రహాలు వెతికితే
జార్జ్ కోసం ఒక మెమోరియల్ నిర్మించు కోలేక పోయాం. ఆయన మీద ఒక చైర్ ఏర్పాటు చేసుకోలేక పోయాం. జార్జ్ సహచరులుగా చెప్పుకుంటున్న చనామంది దేశ విదేశాల్లో ట్రిలియన్ ల కొద్దీ సంపదలో భాగం అయ్యారు.
ఉస్మానియా ఒక ప్రతిభావంతుడైన స్కాలర్ కి చేయూత నివ్వొచ్చు.
బడుల్లో ఆయన ఒక వెలుగు రేఖ అని నినదించ వచ్చు.
ఒక సమగ్రమైన జీవిత చరిత్ర రాయొచ్చు.
ఈ ఐదున్నర దశాబ్దాల కాలం లో జార్జ్ నుండి మనం ఏం నేర్చుకున్నాం
మన రాజకీయ కార్యాచరణ లో ఏం మార్చుకున్నాం
అని ఒక సారి సమీక్ష చేసుకోవచ్చు.
ఆయనకు ఏమాత్రం సంబంధం లేని PDSU ఇప్పుడు ఎన్ని విభాగిని గా న విభజించ బడ్డదో లెక్కలు తెలియాలి ఇప్పుడు (ఆయన బ్రతికి ఉంటె RSU కి మొదటి అధ్యక్షుడు అయ్యేవాడు అది వేరేకథ )
ఆయన బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నలు వేసేవాడు.
మనం చెప్పే నంగి నంగి సమాధానాలు వినడానికి
జార్జ్ లేకున్నా జార్జ్ బాటను నమ్మే విశ్వసించే లక్షలాది గుండెలు ఉన్నాయి.
మీ సమాధానాలు బయటకు చెప్పే ధైర్యం లేకుంటే
మీకు మీరే ఒక సారి చెప్పుకోండి.
అప్పుడు జార్జ్ ఏం నమ్మాడో విస్వసించాడో
అడగడానికి కాలం ఎల్లప్పుడూ సంసిద్దంగా గానే ఉంటది.
కావాల్సింది నిజాయితీ గా నినదించే గొంతు.
అదే జార్జ్ కి మనం ఇచ్చే నివాళి.
అదే జార్జ్ కి మనం ఇచ్చే మద్దతు వాక్యం
అదే జార్జ్ కి మనం ఇచ్చే అనుసరణ.
మీ అల్పపు ఇరుకురాజకీయ సమీకరణాల లో ఆయనను కుదించకండి.
ఆయనది విశాలమైన లోకం , నూతన మానవ ఆవిష్కరణ ఆయన అంతిమ మజిలీ.