రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇక తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. అమ్ముడుపోయాయని అంటున్న రేవంత్.. ఏ గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని.. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నాడని విమర్శించారు. రేవంత్ కి పోయే కాలం వచ్చిందని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

కాగా మునుగోడు ఉప ఎన్నిక.. మాములు ఎన్నిక కాదని..కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నికన్నారు రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామాతో నియోజక వర్గానికి పింఛన్లు వస్తున్నాయని అన్నారు. నల్గొండ జిల్లా అంటే పౌరుషాల ఖిల్లా అని కొనియాడారు. ప్రపంచమంతా మునుగోడు ప్రజలు తీర్పు కోసం ఎదురు చూస్తోందన్నారు.

మునుగోడు విజయం రాజగోపాల్ రెడ్డి విజయం కాదని.. నియోజక వర్గం ప్రజల విజయమన్నారు రాజగోపాల్. ఇది  ఉప ఎన్నిక కాదని.. ధర్మ యుద్ధమని.. ఈ మహా యజ్ఞంలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మునుగోడు ప్రజలు తనని గెలిపిస్తారని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.