విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ

తెలంగాణలో విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ నడుస్తోంది. మజ్లిస్ కు భయపడి కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపిస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం విమోచనం దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని టీపీసీసీ రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటిలో మూడు రోజుల పాటు తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అటు ఎంఐఏం అధినేత అసదుద్దీన్.. విమోచనం దినోత్సవం రోజును జాతీయ సమగ్రత దినోత్సవం గా జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేసీఆర్ కు లేఖ రాశారు. ఆరోజున పాతబస్తీలో తిరంగ యాత్ర చేపడతామని ప్రకటించడం చర్చనీయాంశమైంది.

కాగా సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను.. నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

అటు ఎనిమిదేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని టీపీసీసీ రేవంత్ ప్రశ్నించారు. ఇన్నేండ్లు విమోచనం దినోత్సవం జరపనందుకు కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని.. కేసిఆర్ క్యాబినెట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 17 కు అంతే ప్రాముఖ్యత ఉందని రేవంత్ స్పష్టం చేశారు.

ఇక సెప్టెంబర్ 17 న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. అదే రోజున పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసినట్లు వెల్లడించారు. విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు సంబంధించి రాష్ట్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 16 వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 – సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారని.. అదే రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.