హనుమాన్ జయంతి విశిష్టత!

హనుమాన్ జయంతి విశిష్టత!

హనుమజ్జయంతి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందని శాస్రం చెబుతోంది. చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. హనుమాన్ లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు. రాముని కోసం కర్తవ్యంగా చేశాడు. ఆ కర్తవ్య దీక్ష మనమూ అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి. ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి. అందుకే, ఆంజనేయుడ్ని పూజించాలి. అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు, వ్యక్తిత్వంలోంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి…

ఆంజనేయ స్వామి నామములు:

*హనుమా నంజనా సూనుః !!* *వాయుపుత్రో మహాబలః !!*రామేష్టః ఫల్గుణ సఖః*!! *పింగాక్షో మితవిక్రమః*!!*ఉదధి క్రమణశ్చైవ* !! *సీతాశోకవినాశనః*!! *లక్ష్మణ ప్రాణదాతా చ* *దశగ్రీవస్య దర్పహా*!! *ద్వాదశైతాని నామాని* *కపీంద్రస్య మహాత్మనః*!! *స్వాపకాలే పఠేన్నిత్యం* *యాత్రాకాలే విశేషతః* !!*తస్యమృత్యు భయం నాస్తి*!! *సర్వత్ర విజయీభవేత్*!!

 

హనుమంతుడు, అంజనాసూనుడు, వాయు పుత్రుడు, మహాబలుడు, రామేష్టుడు, ఫల్గుణ సఖుడు, పింగాక్షుడు, అమిత విక్రముడు, ఉదధి క్రమణుడు, సీతాశోక వినాశకుడు, లక్ష్మణ ప్రాణ దాత, దశగ్రీవ దర్పహంత అను 12 నామములను నిద్రపోవునపుడు కానీ, ప్రయాణమగునప్పుడు గానీ, భక్తితో పఠించవలెను. ఈ విధముగా హనుమంతుని నామములను ఉచ్ఛరించిన వారికి అంతటను విజయము కలుగును. మృత్యుభయము కలుగదు. ఈ విధముగా అనన్య శక్తిమంతుడు హనుమంతుడు. ఆ మహనీయుని భజించువారికి ఇహపర సౌఖ్యములు తప్పక కలుగుననుటలో సందేహము లేదు.

 

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యంశ్రీ రామ దూతం శిరసా నమామి!!.

అంజనా నందనం వీరం జానకీ శోక నాశనం
కపీశ మక్ష హంతారం వందే లంకా భయంకరమ్!!.

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్
తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్!

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ తత్ర తత్ర కృత మస్తకాం జలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్!.

హనుమా “లాంగూల స్తోత్రం” ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అన్నింటిలోనూ విజయం సాధిస్తారని నమ్మకం. ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మూలన పుణ్య ఫలాన్ని పొందవచ్చు.

హనుమ లాంగూల స్తోత్రం:

శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|
చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|
త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ ||

ఉపవాస దీక్ష:

జయంతి రోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు.

హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.

నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి.