భారతీయ సినీరంగంలో విశిష్ట పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనకు రావడంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. తన జర్నీలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన స్పందించాడు.. ‘అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి.. గౌరవనీయులైన ప్రధాని మోదీ, ప్రకాష్ జవదేకర్ , జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఇన్నేళ్ల ప్రయాణం లో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు.. నాలోని నటుణ్ని గుర్తించి ప్రోత్సహించిన మిత్రుడు కండక్టర్ రాజ బహుదూర్, సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ , నా గురువుగారు బాలచందర్.. నాకు జీవితాన్నిచ్చిన దర్శకులకు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు ‘ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా రజనీకి ఈ అవార్డు రావడంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.