హిందువులు పవిత్రంగా భవంతుడిని ఆరాధించే మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. నెలరోజుల పాటు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తోంది. ఈమాసంలో ఎలాంటి కార్యం తలపెట్టిన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంటుంది.
నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో కళకళలాడుతుంది. అంతేకాకుండా వర్షబుుతువు అనుగుణంగా విరివిగా వర్షాలు పడతాయి.
సచ్చిదానంద స్వరూపుడి ఆవిర్భావం..
శ్రావణమాసంలోనే వేదపురుషుడు “శ్రీకృష్ణుడు” జన్మించాడని పురాణా ప్రసిద్ధి. సచ్చిదానంద స్వరూపుడి ఆవిర్భావమే ఒక పరమార్ధంతో కూడినది. విశుధ్ధచిత్తంతో కూడిన సత్త్వగుణం,నిష్కామ గుణాల కలయిక వల్ల రసోత్పత్తి ఏర్పడుతుంది. దీనిని “ఆనందగ్రంది” అంటారు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు సత్త్వ గుణంతో కూడి విశుధ్ధ చిత్తం కలవాడు. తల్లి దేవకి నిష్కామ బుద్ధి కలది. ఇటువంటి దంపతుల ఆనందగ్రంది (రసస్వరూపుడు) కృష్ణుడు. ఆ విధంగా జన్మించిన గోవిందుడు ఆ మాతాపితరులకే కాక సకల ప్రాణికోటికి ఆనందామృతము పంచి సచ్చిదానంద స్వరూపుడయ్యాడు. శ్రీకృష్ణుడు చల్లదనం ఇచ్చే సూర్యుడని పరమ భక్తాగ్రేసరుడు వేదాంతదేశికులు అన్నారు. సూర్యుడికి గ్రహణం రావచ్చు. శ్రీకృష్ణుడనే సూర్యుడికి మాత్రం ఏనాటికి గ్రహణం రాదు. ఆయన అవతార అమృత కిరణాలు భూమిని ఎన్ని యుగాలైనా తేజోమయం చేస్తూనే ఉంటాయని పురాణ పండితులు చెబుతుంటారు.
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు ‘శ్రావణ’మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా “వినుట”అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే ‘స్వాధ్యాయ’మనేది మరో నామం.
పంచాంగ ప్రకారం.. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసమని పురాణాలు చెబుతున్నాయి. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
మహావిష్ణువు జన్మనక్షత్రం..
త్రిమూర్తుల్లో స్థితికారకుడిగా పేరున్న మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన.. స్వామిని తలుచుకుంటూ పారాయణం చేస్తారు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు పేర్కొనబడింది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటారు.
మంగళగౌరీ వ్రతం:
మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈమాసంలో ఆచరించే వత్రాలలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు.
మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు — ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే, ప్రతిదినము ముఖ్యమైనదే . ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు,గురువారాల్లో గురుదేవుని ఆరాధన,శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం పురాతన కాలం నుంచి వస్తుంది.