వరుస సభలతో హోరెత్తిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు . పార్టీలోకి చేరికలతో పాటు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభ, ముగింపు సభలను భారీగా నిర్వహించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఈసభలకు భారీ జనసమీకరణ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. ఐదు జిల్లాల్లో మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇక ఆగస్టు 2న ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర సభలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసగించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని కమలం పార్టీ యోచిస్తోంది. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న హన్మకొండ శ్రీభద్రకాళి ఆలయంలో ముగుస్తుంది. యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగాం, హమన్‌కొండ, వరంగల్‌ అనే ఐదు జిల్లాల్లో 325 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. నియోజకవర్గాల్లోని ప్రజలతో మమైకమవుతూ..సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది కమలం పార్టీ. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

యాత్రలో భాగంగా సంజయ్.. చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి, సర్దార్ పాపయ్య గౌడ్‌కు చెందిన కిల్లా షాపూర్ గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అంతేకాక ఆగస్టు 26 న వరంగల్‌లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో సభకు రెండు లక్షల మందిని సమీకరించాలని కాషాయ నేతలు భావిస్తున్నారు.