దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు!

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్​ పాజిటివిటీ రేటు 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని.. కేసులు, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోన్న 10 రాష్ట్రాలను ఆదేశించింది.

దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కొవిడ్​ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా.. మరో 53 జిల్లాల్లో 5-10 శాతంగా ఉంది. ఈ క్రమంలో కొవిడ్​ కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ.కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్​, మణిపుర్​ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేస్​ భూషణ్​. కేసుల గుర్తింపు, కట్టడి, నిర్వహణపైనా సమీక్షించారు.

జిల్లాల వారిగా సొంత సెరోసర్వేలను నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. 80 శాతం మరణాలు 45-60ఏళ్ల వయసు వారిలోనే సంభవిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ బలరామ్​ భార్గవ సూచించారు. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటాన్ని నిరోధించాలని కోరారు.