దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల దృష్ట్యా ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన.. పాజిటివిటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసుల సంఖ్య 22 వేలు దాటింది.
కాగా దేశం మొత్తమ్మీద ఒక్కరోజులో నమోదయ్యే కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉంటున్నాయి. ప్రధానంగా పాలక్కాడ్, కొట్టాయం జిల్లాల్లో నెల రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. కోజికోడ్, మళప్పురం, కన్నూరు, ఎర్నాకుళం, త్రిసూరు, కొల్లాం, తిరువనంతపురం లాంటి జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది.
ఇక కేరళలో కోవిడ్కి తోడు జీకా వైరస్ విజృంభణతో క్రియాశీలక కేసుల పెరుగుదల సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇవి దేశం మొత్తమ్మీద ఉన్న క్రియాశీలక కేసుల్లో దాదాపు 38శాతం. అసలు కేరళలో కేసులు ఉన్నట్లుండి ఇంత ఎక్కువసంఖ్యలో పెరగడానికి కారణం… ఇటీవల ఓ మతపరమైన ఉత్సవం సందర్భంగా కొవిడ్ ఆంక్షలను సడలించడమేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.