దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తితో సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కాగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు బయటపడ్డాయి. దిల్లీలో 22, తెలంగాణ 20, రాజస్థాన్ 17, కర్ణాటక 14, కేరళ 11, గుజరాత్ 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, తమిళనాడు, బెంగాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకుని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు.