యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, న్యూయర్ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54.. దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. ఈ వేరియంట్ బారి నుంచి ఇప్పటివరకు 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే.. 100 దేశాలకు ఈ వేరియంట్ పాకింది. అత్యధిక ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బ్రిటన్‌లో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ దాదాపు 40వేల కొత్త వేరియంట్ కేసులు నమోదవ్వగా.. 12 మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. అక్కడ కొత్త వేరియంట్ కేసులు 73శాతానికి పెరిగాయి. తాజాగా ఈ వేరియంట్ కారణంగా టెక్సాస్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని కొన్ని దేశాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.