చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!

కొలంబో రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (69) ఒంటరి పోరాటంతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో గబ్బర్‌సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్‌, భువనేశ్వర్‌ మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ భారత్కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. అంతకుముందు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ (53) అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. కృనాల్‌ పాండ్యా (35) ఫర్వాలేదనిపించాడు. అయితే, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా(13), శిఖర్‌ ధావన్‌(29), ఇషాన్‌ కిషన్ (1) విఫలమయ్యారు. మధ్యలో మనీశ్‌ పాండే (37; 31 బంతుల్లో 3×4) మోస్తారుగా రాణించాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (50; 71 బంతుల్లో 4×4, 1×6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ చారిత్‌ అసలంక (65; 68 బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె(44 నాటౌట్‌; 33 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఆతిథ్య జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

Related Articles

Latest Articles

Optimized by Optimole