భారత మహిళాల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సుదీర్ఘ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్ ముగింపునకు వచ్చేసిందని మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని.. జట్టులోని సభ్యులంతా మెరుగ్గా ఆడితేనే ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉందని. ఐసీసీ పోస్ట్ చేసిన వీడియోలో మిథాలీ తెలిపింది.
కాగా రెండు దశాబ్దాల కింద తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన మిథాలీ రాజ్.. ఇప్పుడు ఆరోసారి మెగా టోర్నీకి సిద్ధమవుతోంది. 2000లో న్యూజిలాండ్లో తొలి ప్రపంచకప్ ఆడిన ఆమె.. ముగింపు టోర్నీ కూడా న్యూజిలాండ్‌లో జరుగుతుండడం విశేషం. ఈ సందర్భంగా ఆమె అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. టైఫాయిడ్ కారణంగా ఆ ప్రపంచకప్ (కొన్ని మ్యాచ్‌లకు)నకు దూరమయ్యా. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌లో ఉన్నా. ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికే వచ్చేశా. ఇక ఈ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నా” అని మిథాలీ పేర్కొంది.