NukalaNarottam Reddy: సజ్జన సాంగత్యం..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):

సమాజం కోసం అపారమైన సేవ చేసి కూడా అందుకు తగ్గ ప్రచారం, గుర్తింపు పొందని వ్యక్తులు కొందరుంటారు. స్వతహాగా వారికా యావ, ధ్యాస ఉండదు. ఎందుకో, పలు కారణాల వల్ల సమాజం కూడా వారికి పెద్దగా ప్రచారం కల్పించదు. ఫలితంగా, అటువంటి మహనీయుల చరిత్ర సమకాలికుల్లోనూ ఎక్కువ మందికి తెలియదు. ఇక, తర్వాతి తరాల వారికి తెలియడం ఇంకా అరుదు. అయినా వారు తృప్తిగానే వెళిపోతారు. వెళ్లిపోయాక కూడా పలు తరాల వాళ్లకు వారు స్ఫూర్తి పంచుతూనే ఉంటారు. అందుకే, వారు స్ఫూర్తిప్రదాతలు.

 


తెలంగాణ మలితరం వైతాళికులలో ఒకరైన నూకల నరోత్తమ్‌రెడ్డి గారు అటువంటి ముఖ్యుల్లో ఒకరు. జర్నలిజం, సాహిత్యం, సాంస్కృతికం, క్రీడలు, విద్య, పరిపాలన, రాజకీయం…. ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేసిన నరోత్తమ్‌రెడ్డి నిగర్వి, నిరాడంబరుడు, సంస్కారవంతుడు. ఉన్నత పదవుల్లో ఉన్నా ప్రజాసమస్యల పట్ల సానుభూతితో స్పందించే తత్వమాయనది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరోత్తమ్‌రెడ్డికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడాన్ని నేనెప్పుడూ ఒక లోపంగానే పరిగణిస్తాను. దాని వల్ల సమాజమే తప్ప, వారు నష్టపోయేదేమీ ఉండదు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన కల్లోల సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సిలర్‌గా ఉండి దాన్ని సంస్కరించారు. ఎన్నో రంగాలలో దీర్ఘకాలం పాటు నిబద్దతతో కృషి చేశారు.


కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కల్లోలిత కాలం (2021) లోనే ఆయన శతజయంతి (1921`2021) జరిగింది. నరోత్తమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు కొంతమంది ఒకరోజు, జర్నలిజంలో క్రియాశీలంగా ఉన్న మమ్మల్ని మాకు గురుతుల్యులైన ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌రెడ్డి గారి ద్వారా సంప్రదించారు. శతజయంతి ఉత్సవాలు జరుపతలపెట్టామని, ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానించాలని అభ్యర్థించారు. అందుకొక ప్రయత్నం చేశాము. మా కోరికను నాయుడు గారు మన్నించి, కోవిడ్‌లోనూ హైదరాబాద్‌ ‘సెస్‌’లో నిర్వహించిన ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. అప్పుడు, నరోత్తమ్‌రెడ్డిగారిపై ప్రచురించిన ఒక చిన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అందులో ముందుమాటగా నేనొక పుట నరోత్తమ్‌రెడ్డి గారి గురించి రాశాను. ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని అందులో చాటుకున్నాను. ఎంత యాదృచ్ఛికమో చూడండి…… తర్వాతి కాలంలో ఆయన పేరిట ఒక అవార్డును నెలకొల్పడం, దానికి ‘క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ’ వారు నన్ను ఎంపిక చేయడం, రేపు (6.7.2024 శనివారం) ప్రఖ్యాత ‘నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం’లో పలువురు న్యాయకోవిదుల సమక్షంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి చేతుల మీదుగా సదరు అవార్డు నాకు అందివ్వబోవడం…. అన్నీ ఒక రీల్‌ లాగా జరిగిపోతున్నాయి.