ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్‌తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.
సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి లీగ్ రీస్టార్ చేసి.. పూర్తి చేయడానికి మూడు వారాల సమయం కేటాయించామని బీసీసీఐ అధికారి ప్రతినిధి తెలిపారు. అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని.. సవరించిన తేదీల్లో మ్యాచ్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 14న ముగిసిన వెంటనే.. రెండు జట్ల ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో యూఏఈకి తరలిస్తామని పేర్కొన్నారు. మిగతా విదేశీ ఆటగాళ్లను సైతం తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. యూఏఈకి చేరిగానే ఆటగాళ్లందరూ మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ వెల్లడించింది.