Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

కవన మాలి:   ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “

అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం?

స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్ చేసేద్దాం, ఫ్రెండ్ ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెస్తే అమ్మో పెళ్ళాం పోరు పడలేమురా బాబు అంటూ సరదాకే అందాం. అలా సరదా సరదాకే, అప్పుడప్పుడు కోపంలో స్త్రీల శరీర అవయవాలని, నీయమ్మలాంటివి బూతుల్లో కలిపేద్దాం. ఎవరైనా ఏడుస్తుంటే ఆడపిల్లలా ఏడుస్తున్నావు అందాము. పౌరుషం చూపెట్టడానికి ఎదుటోడితో నేనేమి గాజులు తొడుక్కొని కూర్చోలే అందాము. ఇవన్నీ సీరియస్ కాదు, మనకి స్త్రీలంటే చాలా గౌరవం. నాకు తెలుసు కదా.

అవును స్త్రీలకి ఎంతో గౌరవం ఇస్తున్నాం. 

దేవత కదా స్త్రీ. అందుకే గర్భగుడిలోనే ఉండాలి ఆమె. అప్పుడప్పుడు మనమే ఆమెని ఊరేగింపు పేరుతో బయటికి తీసుకువచ్చి తిరిగి గుడిలో పెట్టి తాళం వేసేయాలి. 

ఇంటికి ఆధారం కదా స్త్రీ. అందుకే మగాడు అనేవాడు సంపాదించడానికి, స్త్రీ ఇల్లు చూసుకోవడానికి మాత్రమే పుట్టారు అని నమ్మి, ఇంటిని ఆమె చేతుల్లో పెట్టేస్తాం. ఇల్లయితే ఆమె చేతులో ఉంటుంది కానీ ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఆమె చేతుల్లో ఉండదు. 

స్త్రీ అంటే అమ్మ. అమ్మ పనేమిటి పిల్లలని పెంచడం, నాన్న పని పోషించడం. ఆ మాత్రం దానికి అమ్మ ఎందుకంత కష్టపడి చదువుకుంది అని, పాపం అమ్మకి కూడా ఆశలు ఉంటాయేమో కదా అనే లేనిపోని ఆలోచనలు మనకెందుకు చెప్పు. 

అమ్మ అంటేనే త్యాగమూర్తి అంతే, అలాగని నాన్నని తక్కువ చేస్తున్నాను అనుకొని మనోభావాలు దెబ్బతీసుకోకండి. కాకపోతే నాన్న ఏదైనా త్యాగం చేస్తే గొప్పగా చూసేవాళ్ళు, అమ్మ అలా చేస్తే అది తన బాధ్యతలో భాగం అని తీసిపారేసే గుర్తింపులో చాలా తేడా ఉంది చెప్పడమే నా ఉద్దేశ్యం.

నీకేం తెలియదమ్మ ఊరుకో అని అమ్మ మీద విసుక్కున్నంత సులువుగా నాన్నతో అనగలమా ఆ మాట. పోనీ ఆ మాట నువ్వు సరదాకే అన్నా సరే ఆ ఒక్క క్షణం ఆ మాట అమ్మ మనసులో ఎంత బలంగా గుచ్చుకుంటుందో తెలుసా? అసలు మనలో సగం మందికి మన అమ్మానాన్నలకు ఉన్న జబ్బులు ఏమిటో కూడా తెలియదు. ఇక వాళ్ళ ఇష్టాలు, మనసులు తెలుస్తాయా ? అయ్యో అలాగని నేను మనదేం తప్పు అనట్లేదు. మనకి అసలు ఎన్ని పనులు ఉన్నాయో కదండీ. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, అవసరాలు, అప్పులు. అవుననవును ! ఆగండీ

ఇక్కడ భార్య అని మరొకరు ఉన్నారు కదా. హ ఉన్నారు ఉన్నారు. ఇక్కడ భార్య వల్ల బాధపడే భర్తలు ఉన్నారు, భర్తల వల్ల బాధపడే భార్యలు ఉన్నారు. నేను ఒప్పుకుంటాను. పాపం! భర్త బాధ పంచుకోవడానికి బయటికి వెళ్లొచ్చు, మందు సిగరెట్ తాగొచ్చు, స్నేహితులతో మనసు దిగులు చెప్పుకోవచ్చు. పర్లేదు అప్పుడప్పుడు చిరాకు ఎక్కువైతే కొట్టొచ్చు, అదేం అంత తప్పు కాదు కదా. అదే భార్య అనుకో, ఏం బాధ ఉంటె ఏమిటి ? పనులు ఆగుతాయా? అదే ఇంట్లో మౌనంగా ఉంటె సరిపోతుంది కదా. స్నేహితులంటే మర్చిపోయి ఆమె చాలా కాలం అవుతుంది. 

మీరు మరీ అతి చెబుతున్నారు. అసలు ఈ రోజుల్లో ఆడవాళ్ళూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. అని నన్ను నిలదీస్తారేమో ? నిజానికి నేను కూడా ఒకప్పుడు అదే భ్రమలో ఉన్నా అయితే ఓసారి సరదాగా నేను, మా ఇల్లు, మా చుట్టాలు, స్నేహితులు ఇళ్ళని గమనించా. ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు అని. నాకే నవ్వొచ్చింది. నిజానికి అది బాధతో వచ్చిన నవ్వు. ఏదో నేను పనిచేస్తున్న ఆఫీసు ఫ్లోర్ లో కనిపించిన కొందరిని, బయట బ్యాగులు వేసుకొని తిరిగే కొందరిని చూసి నా దేశం ప్రగతి పథం పట్టింది అనుకున్నాను. నేనెంత మూర్ఖుణ్ణి. దేశంలో పల్లెలు ఎన్ని, పట్నాలు ఎన్ని. పట్నాలలో కూడా చదువుకున్న స్త్రీలు ఎంతమంది, అందులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎందరు. అలాంటిది పట్నాలలో ఓ పదిమందిని చూసి మొత్తం ఆడవాళ్ళూ ఉద్యోగం చేస్తున్నారు. స్వతంత్రంగా బ్రతుకుతున్నారు అనుకున్నానేమిటి ?

కనీసం తన పీరియడ్ ప్యాడ్స్, ఇన్నర్స్ కొనుక్కోవడానికి కూడా భయంగా డబ్బులు అడగాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఎంతమంది ఆడవాళ్లు ఎదురుకొంటున్నారో మనకేమైనా అవగాహనా ఉందా? అందులో మన ఇంట్లో వాళ్ళు ఉండి ఉండొచ్చు అనే ఆలోచన ఉందా? 

మన ఇల్లంటే గుర్తొచ్చింది. మన ఇళ్లల్లో అమ్మ, భార్యతో పాటు అక్క, చెల్లి, కూతురు అని కొందరు ఉంటారు కదా. వాళ్ళల్లో ఎంతమంది మాకు పీరియడ్ వచ్చింది అని మొదటిరోజు ధైర్యంగా వచ్చి నార్మల్ గా చెప్పగలరు మీతో. ముందు మన అమ్మే అంటుంది, అవతలికిపో అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు అంటు అంటూ. మా ఇంట్లో ఇలా లేదు అనకండి. నేను మనందరి ఇళ్ల గురించి మాట్లాడుతున్న. పోనీ మీ ఇంట్లో అయినా సరే ఎప్పుడైనా వాళ్ళ అవసరం తెలుసుకొని మీరు బయటికి  వెళ్లి ప్యాడ్స్ తెచ్చారా ? పోనీ ఆ సమయంలో వాళ్ళ పక్కనే కూర్చొని హార్మోన్ ఇంబ్యాలన్సు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ మానసిక స్థితికి ఊరట నిచ్చేలా ఎప్పుడైనా ఏమైనా సరదాగా మాట్లాడారా ? 

 

ఒక అబ్బాయి తన ప్రేమ విషయంలో ఇంట్లో చెబితే వచ్చే స్పందనకి, అదే ఇంట్లో అమ్మాయి తన ప్రేమ విషయం చెబితే వచ్చే స్పందనకి ఎంత తేడా ఉంటుందో మనకి తెలుసు. అయినా అవన్నీ ఇలా మాట్లాడకూడదు కదా. మరచిపోయా. 

 

ఆడపిల్ల ఇంటి పరువు కదా. మన కులపొన్నే పెళ్లి చేసుకోవాలి. మన వంశ గౌరవం నిలబెట్టాలి. అవునవును మనది పెద్ద శ్రీకృష్ణదేవరాయల వంశం కదా మరి. ఆవిడే నిలబెట్టాలి. లేదంటే ఏముంది అయితే చంపేస్తారు లేదా బలవంతపు పెళ్లి చేస్తారు. అందులో తప్పేం ఉంది. ఆడపిల్ల అంటే ఎంత అపురూపం మనకి. కాకపోతే బయట ప్రేమని వెతుక్కునే అమ్మాయిని దారితప్పింది అని ముద్ర వేసే పేరెంట్స్, అసలు ఆ అమ్మాయికి ఆ ప్రేమని మనం ఇంట్లో ఇస్తున్నామా అని ఆలోచిస్తారా ? ఎందుకు ఆలోచించాలి, లక్షలు లక్షలు పోసీ చదివించాం, కావలసినవి అన్నీ కొనిచ్చాం, అవన్నీ చాలవన్నట్టు మళ్ళీ ఈ ప్రేమ కూడా ఇంట్లోవాళ్ళు ఇవ్వాలంటే ఎలా ? ఎంత అన్యాయం అసలు? 

ఇంత ఎందుకు రా ? ప్రతీ పది ఇళ్లల్లో ఐదు ఇళ్లల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంది, అది కూడా చాలామంది దెగ్గర వారే అలా చేస్తున్నారు అని మీకు తెలుసా ? మా ఇంట్లో ఇలా జరగదు అంటావేమో ? నిజంగా అలా జరిగినా ఆ అమ్మాయి మనతో వచ్చి చెప్పే ధైర్యం మనం ఇచ్చామా ? కనీసం గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి మన పిల్లలతో మనం మాట్లాడతామా ? లేదు లేదు వాళ్ళతోనే కలిసి దబర్దస్తులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న సినిమాలు చూస్తాం,వాళ్ళ ముందే అది వాడితో తిరిగింది, వీడు దానితో పండుకున్నాడు అని అడ్డమైనవి మాట్లాడదాం. అయినా ఈ గోల అంతా ఎప్పుడు ఉండేదే కానీ, ముందు వెంటనే హ్యాపీ ఉమెన్స్ డే అని ఒక పోస్టు సోషల్ మీడియాలో పడేద్దాం, లేదంటే మనకి స్త్రీలంటే గౌరవం లేదు అనుకుంటారు. 

అయినా వీడెవడ్రా వీడికి ఈ రోజే గుర్తొచ్చాయా ఇవన్నీ అని అంటారేమో ? అదే ప్రశ్న నాది కూడా మీకు కూడా ఈ రోజే గుర్తొచ్చిందా ఇదంతా అని.

నిజంగా మీరు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే మిమ్మల్ని కనిపెంచిన అమ్మకి ఫోన్ చేసి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడండి, ఆమె పొందే ఆనందం మీకు తెలియదు. మీ భార్యకి తనకి నచ్చిన వంటకం వండి ఆమెతో కలిసి కూర్చుని మాట్లాడుతూ తినండి. ఆమె కళ్ళల్లో నీటి రేఖ మిమ్మల్ని పలకరిస్తుంది. మీ కూతురుతో కూర్చుని తన ఇబ్బందులు అడగండి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పండి. చదువుకొని, పెళ్ళై, పిల్లలు ఉన్నా ఉద్యోగం చేస్తున్న మీ అక్కకో, చెల్లికో, స్నేహితురాలికో హ్యాపీ ఉమెన్స్ డే ఫీలింగ్,  ప్రౌడ్ ఆఫ్ యు అని మెసేజ్ పెట్టండి. చాలు.

స్త్రీ ఏం గొప్ప కాదు, మగాడి కంటే ఎక్కువ కాదు, అలాగని తక్కువా కాదు. స్త్రీ కూడా సాటి మనిషి అంతే. ఆమెని అలా చూడండి ముందు. అది చాలు.