TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?

Nancharaiah merugumala senior journalist::

జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా?

పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను చూసి మహాత్మా మోహన్ దాస్ గాంధీ ఎంతగానో నొచ్చుకునేవారు. మందిరాల్లో మురికిని, శుచీశుభ్రంలేని పరిస్థితులను ఆయన పదేపదే ఎండగట్టేవారు. తనకు స్వాతంత్య్రం కన్నా పరిశుభ్రతే ముఖ్యమని బాపూ నొక్కిచెప్పేవారు. తెల్లారి లేస్తే గాంధీ పేరు చెప్పే మన పాలకులకు పారిశుద్ధ్యం విషయంలో అసలు కనీస శ్రద్ధ లేదని తిరుమల లడ్డూ తయారీ ప్రక్రియ చూస్తే తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో ఇండియా పరువు పోయే రీతిలో దాదాపు నగ్నంగా ఉన్న ఉద్యోగలు ప్రసాదం తయారు చేయడం ఇంత వరకూ ఎవరికీ పట్టని విషయం కావడం మన స్వచ్ఛ భారతానికి అద్దంపడుతోంది.

తిరుమల వెంకన్న బూందీ లడ్డూ తయారీలో ఇతర జంతువుల (ఆవుల కాకుండా ఇతర నాలుగు కాళ్ల జంతువులు) కొవ్వు వాడుతున్నారనే వివాదం ఫలితంగా కొండ మీద ప్రసాదం ‘ఉత్పత్తి’ ప్రక్రియ లక్షలాది మంది తెలుగు ప్రజలను ‘తీవ్ర దిగ్భ్రాంతి’కి గురిచేసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఏడు కొండల లడ్డూ తయారీ ‘అపవిత్ర పద్ధతి’లో సాగుతోందనే ఆరోపణపై చెప్పిన మాటలను తెలుగు సహా అనేక జాతీయ న్యూజ్‌ చానల్స్‌లో వినిపించాయి. అంతేగాక అవి తిరుమలలో ఈ ప్రసాదం లడ్డూల తయారీకి అవసరమైన బూందీ, పాకం వండుతున్నవారితో కూడిన విజువల్స్‌ను నిన్నటి నుంచి పదే పదే చూపిస్తున్నాయి. ఈ కదిలే దృశ్యాల్లో కనిపించే లడ్డూ వంటవాళ్లు నడుము నుంచి మోకాళ్ల పైకి మాత్రమే బట్టలు ధరించి లడ్డూ ఉత్పత్తి పనిలో మునిగి ఉన్నట్టు స్పష్టమవుతోంది. పవిత్రత సంగతి దేవుడెరుగు, అసలు పరిశుభ్రతకు ‘శ్రీవారి పోటు’లో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వరని కిందా పైనా కొద్దిగానైనా బట్టలు లేకుండా ఉన్న ప్రసాదం కార్మికులను చూస్తే అర్ధమౌతోంది. ఒంటి మీద పై భాగంలో కేవలం జంధ్యం మాత్రమే వేసుకుని చెమటలు కక్కుతున్న ప్రసాదం వండేవారిని చూస్తే…బ్రిటిష్‌వారు ఎలాంటి హింసాయుత ప్రతిఘటన లేకుండానే ఎందుకు స్వాతంత్య్రం ఇచ్చి మాతృదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారో అర్ధమౌతోంది. హైదరాబాద్, బెజవాడ, కర్నూలు వంటి రెండు తెలుగు రాష్ట్రాల చిన్నాపెద్దా నగరాల్లోని ఒక మోస్తరు లగ్జరీ రెస్టారెంట్లు, హోటళ్లలో సైతం కిచెన్లలో కాళ్లూచేతులూ పూర్తిగా కవరయ్యేలా దుస్తులు ధరించడమేగాక హస్తాలకు గ్లవుజులు, తల మీద వెంట్రుకలు ఆహారపదార్ధాల్లో పడకుండా నివారించడానికి నిండుగా టోపీలు ధరించడం మనం సినిమాల్లో, టీవీ చానళ్ల వార్తల్లో చూస్తూనే ఉన్నాం. చేతులతో తినడం, తినుబండారాలు తయారుచేయడంలో హస్తాలకు ఎలాంటి ఆచ్చాదన లేకుండా ఉండడం బారతదేశంలో ఎప్పటి నుంచో మన పరిస్థితులను బట్టి సాంప్రదాయంగా కొనసాగుతోంది.

లడ్డూలు తయారుచేసే వారి వంటిపై బట్టలు అవసరం లేదా? జంధ్యం చాలా?

కాని, ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లు, పవిత్ర ఆలయాల్లోని వంటశాలల్లో పనిచేసే ఉద్యోగులు తాము తయారుచేసే పదార్ధాల శుభ్రతకు దోహదం చేసే విధంగా దుస్తులు ధరించాలి. అంతేగాని, దాదాపు మూడొంతులు నగ్నంగా ఉండే తమ శరీర భాగాల నుంచి చెమట, వెంట్రుకలు వంటకాలు లేదా ప్రసాదాల్లో పడేలా బట్టలు ధరించడం పవిత్ర పరంపర పేరుతో ప్రజలను అవమానించడమే. ఇండియాలో అసలు పవిత్రతతో పరిశుభ్రతకు లంకె లేదా సంబంధమే లేదనే అభిప్రాయం నూరు శాతం నిజమని తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూల తయారీ ప్రక్రియ దృశ్యాలు చూస్తే చిన్న పిల్లలకైనా అర్ధమౌతుంది. హిందూ, ముస్లిం మతాల పునాదిగా పుట్టిన సిక్కు మత ప్రార్థనా స్థలాలైన గురుద్వారాల్లో ప్రసాదంగా భక్తులకు ఇచ్చే రొట్టెలు, కూర, పాలతో చేసిన సేమియా, సగ్గుబియ్యం వంటివి పూర్తిగా ఉచితమనే విషయం సగం మంది హిందువులకు కూడా తెలియదేమో. జంతు కొవ్వును ఆవు నెయ్యితో కలిపారనే ఆరోపణ లేదా నివేదిక ఫలితంగా– ఎంతో అపరిశ్రుభంగా కనిపించే ఉద్యోగలు తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారో ప్రజలకు తెలిసింది. ఆవు నేయిలో కల్తీ జరిగిన విషయంతోపాటు భవిష్యత్తులోనైనా వంటి నిండా దుస్తులు, నెత్తికి టోపీలు, చేతులకు గ్లవుజులు ధరించిన ఉద్యోగులతోనే లడ్డూలు, వడలు వంటి పవిత్ర ప్రసాదాలను శ్రీవారి పోటులో తయారు చేయిస్తే అలివేలు మంగమ్మ సమేత కోనేటి రాయుడు సంతోషిస్తాడు.

శ్రీవారి వంటశాలలో పనిచేసే ఉద్యోగులు లేదా శ్రామికులు ఎలా డ్రెస్‌ చేసుకోవాలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ఆల్మండ్‌ హౌస్‌ తదితర మిఠాయి దుకాణాల సముదాయాల యజమానులను టీటీడీ అధికారులు సంప్రదిస్తే సరిపోతుంది.

(* మొదటి 3 ఫోటోలు తిరుమల పోటులో లడ్డూల తయారీకి సంబంధించినవి.
* నాలుగో ఫోటో: హైదరాబాద్ కు చెందిన ప్రసిద్ధ స్వీట్ల దుకాణాల కిచెన్ లో వంతచేస్తున్న ఉద్యోగి.)

Optimized by Optimole