Telangana: తెలంగాణ బీజేపీలో ఎంపీల వర్గపోరు..?

BJPTELANGANA:

(రిపోర్ట్: సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ✍)

తెలంగాణ బీజేపీలో వర్గ రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు ఓ వర్గంగా,మిగతా ఎంపీలు మరో వర్గంగా విడిపోయారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కే. విశ్వేశ్వర రెడ్డి తన కొత్త నివాసంలో ఏర్పాటు చేసిన విందు భేటీ ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ విందులో బీజేపీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, ధర్మపురి అర్వింద్, గోడం నాగేశ్ హాజరవగా, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మాత్రం గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇటీవల హుజూరాబాద్ వేదికగా బీజేపీ ఎంపీలు బండి సంజయ్ – ఈటల మధ్య మాటల యుద్ధం నడిచింది.పేరు ప్రస్తావించకుండా నువ్వేవడివి అసలు? నా చరిత్ర తెలియదు అంటూ ఈటల ఇండైరెక్ట్ గా బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీల భేటీకి ఆయన దూరంగా ఉండటంపై బండి సంజయ్‌ను కూరలో కరివేపాకులా తీసిపారేశారా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. బీజేపీలో తాము అంతా ఒక్కటేనంటూ పదే పదే చెబుతూ వస్తున్న నేతల మాటలకు…. భిన్నంగా జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకపోవడంతో రెండు వర్గాలుగా చీలిపోయారన్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావుకి ఈ రెండు వర్గాల ఎంపీల పోరు సమస్య తలనొప్పిగా మారింది. ఈ పరిణామలపై ఆయన ఆందోళన చెందినట్లు తెలుస్తోంది.అటు బీజేపీ హై కమాండ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూసే ధోరణిలో కమలనాథులు ఉన్నారు.మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రూపు తగాదాలు కమలం పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

Optimized by Optimole