వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్‌’ పేరిట మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్‌ ‘పల్లవి ప్రశాంత్‌’ సలార్‌ డైరెక్టర్‌ ‘ప్రశాంత్‌ నీల్‌’ పేర్లు వైరల్‌ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ వైరల్‌ అవుతున్నారు.  గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి  సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా? ఈ సైకలాజికల్‌ వార్‌లో నిజంగా వ్యూహకర్తల ప్రణాళికలు ఎంతవరకు పని చేస్తాయి ? వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే క్రమంలో పీపుల్స్‌ పల్స్‌ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం సునీల్‌ కొనుగోలు వ్యూహాలు రచించారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆ పార్టీ గెలుపు తర్వాత పీసీసీ చీఫ్‌ మొదలుకొని ప్రధాన నేతలెవరూ ఆయన పేరే ఎత్తలేదు. తెలంగాణలో పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌పై ప్రజావ్యతిరేకత ఏర్పడడంతో ప్రజలు వర్సస్‌ బీఆర్‌ఎస్‌గా ఎన్నికలు జరిగాయి. నిజంగా సునీల్‌ కోనుగోలుతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుస్తే ఏపీలో కూడా ఆ పార్టీ అదే పని చేయవచ్చు కదా..! తెలంగాణలో రాజకీయంగా స్ధిరపడాలని భావించిన షర్మిలకు ఒక వ్యూహకర్త పాదయాత్ర ప్రయోగాలు చేసినా ఆమె పోరాడకుండానే యుద్ధంలో అస్త్రసన్యాసం చేశారు. మరి దీనికి ఏ వ్యూహకర్త కారణం..?  వ్యూహకర్తల ఆలోచనల కంటే ప్రజా బలమే ప్రధానమని ఈ తార్కాణాలు రుజువు చేస్తున్నాయి. 

ప్రజల మనసులో ఏముంది? ఏం చేస్తే నాయకులు వారి మనసును గెలుచుకోగలరు? ఈ రెండు ప్రశ్నలకు రాజకీయ వ్యూహకర్తలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమాధానాన్ని అన్వేషించి, వాటినే రాజకీయ పార్టీలకు  వ్యూహాలుగా మలిచి అందిస్తారు. అవే  విజన్‌గా, మేనిఫెస్టోగా రూపుదిద్దుకుంటాయి. ఇలాంటి రాజకీయ వ్యూహకర్తలు పీకేతోనే పుట్టుకురాలేదు. ఆయన కన్నా ముందు అనేక పార్టీలకు చాలామంది వ్యూహకర్తలుగా, సలహాదారులుగా పని చేశారు. అమెరికాలో 1960 ల్లో జోసెఫ్‌ నెపోలిటన్‌ అనే వ్యక్తి మొదటిసారి పొలిటికల్‌ కన్సల్టెంట్‌గా గుర్తింపు పొందారు. జాన్‌.ఎఫ్‌ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడు కావడానికి ఆయన అనేక ప్రచార కార్యక్రమాలు రూపొందించారు. మన దేశంలో 90వ దశకం నుంచి నాయకులు సర్వేలపై, వ్యూహకర్తలపై ఆధారపడటం పెరుగుతూ వచ్చింది. ఇదంతా ఒకప్పుడు తెరవెనక సాగే కథగా ఉండేది. ప్రశాంత్‌ కిషోర్‌ దానిని ఇప్పుడు తెర ముందుకు తీసుకొచ్చి, పొలిటికల్‌ కార్పోరేట్‌ బిజినెస్‌గా మార్చారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌ ఒక వస్తువును అమ్మినట్టు, పీకే తన టీమ్‌తో ‘హైప్‌’ని సృష్టిస్తూ రాజకీయ పార్టీలను, అభ్యర్థులను తన క్లయింట్స్‌గా చేసుకున్నారు. ఆయన మార్కెటింగ్‌ చతురతతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు రాజకీయాల్లో ఆయన పేరు మారుమోగుతోంది. 

దేశంలో వ్యూహకర్తలు లేనిదే ఎన్నికల్లో గెలవలేమనే వాతావరణాన్ని సృష్టించారు. నాయకుల బలహీనతలను ఆసరా చేసుకొని డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యూహకర్తలు అడుగులేస్తున్నారు. నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగుంటే ఏ వ్యూహకర్తలతో పనిలేదు. క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలతో పార్టీ అధినేతలు క్రమంగా సంబంధాలు కొనసాగిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది వ్యూహకర్తల కంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా చెప్పగలుగుతారు.

గుజరాత్‌లో మోదీ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి, ఆ తర్వాత 2014లో ప్రధానమంత్రి కావడానికి ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీకి పని చేశారనేది ఒక అపోహ మాత్రమే. బీజేపీ 2014లో గెలిస్తే పీకేతో సంబంధం లేకుండానే కేంద్రంలో బీజేపీ 2014లో కంటే 2019లో అధికంగా 21 సీట్లు సాధించిందనేది గమనించాల్సిన అంశం. పంజాబ్‌లో అమరేందర్ సింగ్‌, ఢిల్లీ లో కేజ్రీవాల్‌, బిహార్‌లో నితీశ్‌ కుమార్‌, ఏపీలో జగన్‌, తమిళనాడులో స్టాలిన్‌, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి చేయడానికి పని చేసి విజయం సాధించినట్టు ఆయన స్థాపించిన తన ఐ ప్యాక్‌ సంస్థ వెబ్‌ సైట్‌లో ఉంది.

ఎన్నికల వ్యూహంలో పీకే స్ట్రయిక్‌ రేట్‌ చూసి ఆయన ఎటువైపు నిలబడితే అటే గెలుపనే భ్రమ పడేవాళ్ల సంఖ్య పెరిగింది. మరోవైపు పీకే ఏ పార్టీనీ గెలిపించరు, గెలిచే పార్టీనే ఎంచుకోవడమే అతని వ్యూహమనే  ప్రచారముంది. రెండేళ్ల క్రితం ఐ ప్యాక్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన పీకే తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో రాజకీయ కార్యాచరణకు పూనుకున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నాయకుడిగా ఎదగడానికి పాదయాత్ర చేపట్టిన ఆయన అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. సంస్థ నుంచి తప్పుకున్నట్టు ఆయన  ప్రకటించినా ఇప్పటికీ పీకే పేరు ఐ ప్యాక్‌కి పర్యాయ పదంగానే కొనసాగుతోంది.

ఇక ఏపీ రాజకీయలను పరిశీలిస్తే కేవలం రాజకీయల వ్యూహాల కోసమే అయితే, చంద్రబాబు పీకేని రహస్యంగా సంప్రదించి ఆయన సలహాలు, సూచనలు తీసుకునేవారు. ఇందుకు భిన్నంగా గన్నవరం విమనాశ్రయంలో లోకేశ్‌తో కలిసి పీకే రావడం, దీన్ని మీడియాకు లీక్‌ చేయడం ద్వారా వైస్సార్సీపీ కార్యకర్తల్లో టీడీపీ అలజడి సృష్టిస్తూ సైకలాజికల్‌ వార్‌ మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పని చేసిన పీకే తమను గెలిపించడానికి వచ్చిన విభీషణుడని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా పీకే టీడీపీని నాశనం చేయడానికి వెళ్లిన శకుని అని వైఎస్సార్సీపీ వర్గం అనుకుంటోంది.

పీకేతో కలిసి చంద్రబాబు ముల్లును ముల్లుతోనే తీస్తున్నారని టీడీపీ శ్రేణులు సంబరపడుతుండగా బీహార్‌ నుంచి వచ్చిన పీకే తోక కట్‌ చేస్తామని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పుడు  ప్రస్తావిస్తున్నారు. టీడీపీకి వారి నాయకత్వం మీద విశ్వాసం లేకనే పీకేని శరణు కోరారని, కోడికత్తి, పింక్‌ డైమండ్‌, బాబాయ్‌ గొడ్డలిపోటు వంటివన్నీ పీకే శకుని వ్యూహాలంటూ నారా లోకేశ్‌ చేసిన ఆరోపణలను ఇప్పుడు తవ్వి తీసి వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబుతో పీకే సమావేశం తర్వాత ఐ ప్యాక్‌ సంస్థ ఎక్స్‌ ఖాతాలో స్పందిస్తూ ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి తమ సేవలు కొనసాగుతాయని, 2024లో తమదే విజయమని ట్వీట్‌ చేసింది. దీంతో ఎవరు ఎటువైపో అర్థంకానీ గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. నిన్నటి వరకు వైఎస్సార్సీపీ వాళ్లకు మిత్రుడిగా ఉన్న పీకే ఇప్పుడు శత్రువు అయ్యారు. టీడీపీ-జనసేన వాళ్లకు నాటి శత్రువుతోనే ఈ రోజు స్నేహం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

నిజాయితీ, నిబద్ధత అనేవి కార్యకర్తల స్థాయి మాటలు. ఇందుకు భిన్నంగా లాభం, లబ్ది వ్యాపార సూత్రాలను రాజకీయ వ్యూహకర్తలు అనుసరిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పని చేసిన పీకే ఇప్పుడు టీడీపీకి పని చేయడంలో తప్పు లేదు! ఇది చూసి వైఎస్సార్సీపీ అభిమానులు ఆందోళన చెందడంలో అర్థం లేదు! పీకే టీడీపీ శిబిరానికి ఎందుకు చేరారు అనేదానిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. పాత క్లయింట్‌ వైఎస్సార్సీపీ మీద సానుకూలత లేకనో, 2019లో వైఎస్సార్సీపీని గెలిపించింది తానే అని క్రెడిట్‌ తీసుకోవడానికో, లేదా టీడీపీ నుంచి వ్యాపార లబ్ది కోసమో పీకే చంద్రబాబు గుమ్మం తొక్కారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాస్తవాన్ని గుర్తించాలి. 

వాస్తవానికి టీడీపీ కోసం పీకే శిష్యులు రాబిన్‌ శర్మ, శంతన్‌ సింగ్‌ నాలుగేళ్ల నుంచి వ్యూహకర్తలుగా పని చేస్తున్నారు. ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ వంటి కార్యక్రమాలు తప్ప పెద్దగా ప్రజాధారణ పొందిన కార్యక్రమాలేమీ వాళ్లు రూపొందించలేకపోయారు. యువగళం పాదయాత్రను కూడా కార్పోరేట్‌ ఈవెంట్‌ లాగా మార్చేశారనే విమర్శలు ఉన్నాయి. పైగా అది అనుకున్నంత లక్ష్యం కూడా చేరలేకపోయింది!  

ఎమర్జెన్సీ తర్వాత కాళ్లకి బలపం కట్టుకుని దేశమంతా తిరిగిన ఇందిరాగాంధీ 1980లో కాంగ్రెస్‌ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇందుకు ఆమె ఏ వ్యూహకర్తలనూ నియమించుకోలేదు. 1983లో ఏపీలో ఎన్టీ  రామారావు కూడా వ్యూహకర్తల సహాయం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. 2003లో ఎలాంటి కార్పోరేట్‌ కన్సెల్టెంట్‌ సంస్థల అండా లేకుండానే దివంగతనేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2014, 2018లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వెనక కూడా ప్రజలు తప్ప ఏ వ్యూహకర్తా లేరు. కేవలం వ్యూహకర్తలతోనే విజయం సాధ్యమవుతుంది అంటే  వీరు యూపీలో, ఏపీలో కాంగ్రెస్‌ని గెలిపించగలరా? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులను అధికారంలోకి తీసుకురాగలరా? తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో జన్‌ సూరాజ్‌ పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్‌ కిశోర్‌ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తన వ్యూహాలతో ఆ రాష్ట్రంలోని నలభై ఎంపీ స్థానాలను గెలుచుకోగలరా? 

క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలుండే కింద స్థాయి నేతలు, కార్యకర్తలతో పార్టీ అధినేతలు నిత్యం సంబంధాలు కొనసాగిస్తే ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుస్తాయి. వాటిని అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పార్టీలకుంటాయి. చంద్రబాబు, జగన్‌, కేసీఆర్‌, రేవంత్‌తో సహా ఏ అధినేత అయినా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, వీడియో కాన్ఫిరెన్స్‌లు నిర్వహిస్తారు. అయితే ఇందులో అధినేతలు చెప్పిందే కార్యకర్తలు వినాలే తప్ప, వారిచ్చే సూచనలు, సలహాలను బడా నేతలెవరూ వినరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమీ కావాలో పైవారికి తెలియక వ్యూహకర్తల వలలో చిక్కుకుంటున్నారు.

కార్యకర్తలు లేని పార్టీలకు వ్యూహకర్తలు ప్రాణం పోయలేరు. కార్యకర్తలను మించిన వ్యూహకర్తలు లేరని పార్టీలు తెలుసుకోవాలి. గ్రామాల్లోని సర్పంచ్‌ లేదా కార్యకర్తలతో మాట్లాడితే పార్టీ పరిస్థితి అవగాహనలోకి వస్తుంది. దీనికోసం టెక్నోక్రాట్స్‌ అక్కర్లేదు. వందల కోట్లు పెట్టి వ్యూహకర్తలను కాదు పెట్టుకోవాల్సింది 100 ఓట్లను ప్రభావితం చేసే కార్యకర్తను పట్టించుకుంటే, ఆ పార్టీ తరతరాలు నిలబడుతుందని గుర్తించాలి. ఐ ప్యాక్‌ చెప్పినట్టు విని, వేర్ల లాంటి కార్యకర్తల్ని, దిగువస్థాయి నాయకులను విస్మరిస్తే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎదురైన ఓటమే నిదర్శనం. విద్యార్థి రాజకీయాల్లో కూడా గెలవని వారి సలహాలతో నడుచుకుంటున్న నలభై ఏళ్ల టీడీపీకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.   

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్న పీకేతో 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఇంత విలువైన ఈ 180 నిమిషాల సమయాన్ని ఆయన గతంలో కార్యకర్తలకు కేటాయించి ఉంటే టీడీపీకి 2019లో ఘోరపరాజయం ఎదురయ్యేది కాదు. 1994 నుండి 1999 వరకు ప్రతిరోజు పార్టీ కోసం కనీసం 3- 4 గంటల సమయాన్ని చంద్రబాబు కేటాయించేవారు. ఆయన 1999లో రెండోసారి సీఎం అయ్యాక పార్టీని, పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో మూల్యం చెల్లించారు. 2014`19 మధ్య కూడా అదే తరహాలో ప్రవర్తించి మరోసారి అధికారం కోల్పోయారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌ కూడా పార్టీని, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రజలకు దూరమవుతోంది. తెలంగాణలో 2018 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కూడా పార్టీని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2023లో ఓడిపోయారు.

1994లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఒకసారి పార్లమెంటు ప్రాంగణంలో పీవీ నరసింహారావును కలిశారు. ‘‘ఏంటయ్యా ఇలా చేశావు?’ అని పీవీ అడిగి ముందుకెళ్తుండగా ‘ప్రజలు ఓట్లేయ్యలేదు సర్‌’ అన్నారు ఉండవల్లి. ఆ సమాధానానికి ఒక్కసారిగా ఆగి ‘‘నువ్వొక్కడివే నిజం చెప్పావయ్యా… అందరూ ఓటమికి రకరకాల పనికిరాని కారణాలు చెప్తున్నారు’’ అన్నారంట పీవీ. కాబట్టి, పార్టీకి ప్రజలే ముఖ్యం. ప్రజల్లో లేని పార్టీని ఏ వ్యూహకర్త పైకి లేపలేడు. ప్రస్తుతం ఏపీలో పీకే ఫ్యాక్టర్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో తప్ప క్షేత్రస్థాయి ప్రజల్లో చర్చే లేదు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే అధికారంలోకి రావాలంటే కన్సెల్టెన్సీ వ్యూహాల కంటే ప్రజల విశ్వాసం, కార్యకర్తల బలమే ప్రధానం. లేకపోతే వ్యూహకర్తల పన్నాగాలలో చిక్కుకొని పార్టీలు భంగపాటుకు గురవడం ఖాయం.

================

– జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

 

Optimized by Optimole