‘యువశక్తి’ ఉద్దేశ్యం ‘మన యువత… మన భవిత’ : జనసేనాని

శ్రీకాకుళంలో స్వామి వివేకానంద జయంతి రోజును పురస్కరించుకుని జనసేన ‘యువశక్తి ‘ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు జన సైనికులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా  ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ‘యువశక్తి ‘ కార్యక్రమం  పోస్టర్లను జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. యువతరాన్ని అత్యధికంగా కలిగిన దేశంగా భారతదేశానికి పేరుందన్న ఆయన.. దేశానికి వెన్నెముక వారని కొనియాడారు.  ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు వంటి అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది.. ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాలు యువత తెలియజేసేందుకు యువశక్తి వేదిక గళమవుతుందని పవన్ స్పష్టం చేశారు.

 ఉత్తరాంధ్ర సమస్యలతోపాటు కష్టాల కడలి నుంచి విజయాలు సాధించిన గొప్ప వ్యక్తుల ప్రసంగం.. ప్రపంచానికి చాటిచెప్పేలా యువశక్తి కార్యక్రమం ఉంటుందన్నారు జనసేనాని.  ఉత్తరాంధ్ర యువత కలలుగనే రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది వారే ఆవిష్కరిస్తారని.. వారి ఆలోచనలు . ఆవేదనలను వారి గొంతు నుంచే విందామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక్కటే ‘మన యువత… మన భవిత’ అనేదే ప్రధాన నినాదంగా యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.. పీఏసీ సభ్యులు  నాగబాబు..పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ఉపాధ్యక్షులు  బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, కార్యక్రమాల కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

You May Have Missed

Optimized by Optimole