అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఏది జరగకూడదని కోరుకుంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో న భూతో న భవిష్యతీ రీతిలో జరిగింది. అశేష జన సందోహం మధ్య జనసేనాని అధ్బుతమైన ప్రసంగంతో ఆకటుకున్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పోషించబోయే పాత్రను సభ వేదికగా పవన్ క్లియర్ కట్ గా తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన రాష్ట్ర రాజకీయ యవనికపై బలమైన సంకేతం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన రాజకీయ బలి పశువు కాబోదని తేల్చిచెప్పారు.
ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ పొత్తుపై పవన్ పార్టీ ఆవిర్భావ సభలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు టీడీపీతో పొత్తులు,సీట్ల గురించి చర్చించలేదని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ ప్రయోజనం కోసమే వైసీపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని కుండ బద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు. యువతలో కులరహితంగా అలోచించే పరివర్తన రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బలంగా ఉంటే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల కోసం జనసేనకు వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడండని ప్రజలను పవన్ అభ్యర్ధించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో కులం పెత్తనం ఆగిపోవాలన్నారు పవన్ కళ్యాణ్. భావి తరాల కోసం కులాలను చూడకండని..కులాల గురించి ప్రసంగాలు దంచేసే వారి ఇంట్లో కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారని ప్రస్తావించారు.యువత కులాన్ని కాకుండా గుణాన్ని చూసి వారి పక్షాన నిలబడాలని హితువు పలికారు. ప్రత్యర్థులు తనను తిట్టడానికి కాపులు.. బీసీలు.. దళితులను వాడుకుంటున్నారని వాపోయారు.ఉచిత విద్య, వైద్యం కోసం జనసేన కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు.