ప్రజాపోరాటమే జనసేన ప్రస్థానం : నాదెండ్ల మనోహర్

అమరావతి: ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభద్రతా భావంతో గడప గడపకు కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవ చేశారు. డబ్బు సంపాదనకే తప్ప… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక వైసీపీ నాయకులకు లేదని ఆయన అన్నారు. చెడ్డవాడి చేతిలో చట్టం ఉంటే… చట్టం కూడా చెడిపోతుందని, అదే మంచివాడి చేతిలో ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయలేని ఈ ముఖ్యమంత్రి… మూడు రాజధానులు గురించి మాట్లాడటం హాస్యాస్పందగా ఉందన్నారు. పాలన దక్షత లేని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.   మంగళవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేదిక నుంచి ప్రసంగించారు. అంతకుముందు కృష్ణా జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  చేతుల మీదుగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ… “ ఈ రోజు మనందరికి ఎంతో పవిత్రమైన రోజు. తొమ్మిదేళ్ల సుదీర్ఘమైన ప్రస్థానం. ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు ఎదురొడ్డి  పవన్ కళ్యాణ్  పార్టీని 10వ ఆవిర్భావం దినోత్సవం వరకు తీసుకొచ్చారు. ఈ ప్రస్థానంలో ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపడుతుంటే అడ్డుకోవాలని చూశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనుతిరగలేదు. 2014లో పార్టీ స్థాపించినప్పుడు వచ్చే 25 ఏళ్ల నా జీవితం ప్రజలకు అంకితమని చెప్పారు. ఈ రోజుకూ అదే మాటమీద నిలబడి పోరాటం చేస్తున్నారు. 

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుదిరగలేదు..

గత సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్  పోరాటయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలు పెట్టారన్నారు మనోహర్. అప్పుడు ఆయన అకౌంట్లో కేవలం రూ. 7 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎలక్షన్లలో ఓడిపోయిన ఆరు నెలలకే విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేపట్టారని గుర్తు చేశారు. డొక్కా సీతమ్మ  స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆకలి తీర్చడానికి ఐదు రోజుల పాటు ఆహార శిబిరాలు నిర్వహించామన్నారు. అరెస్టు చేస్తామని బెదిరించినా కంచెలు తెంచుకుంటూ అమరావతి రైతులకు జనసేనాని అండగా నిలబడ్డారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడిన మొట్ట మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని తేల్చిచెప్పారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నా ఏనాడూ పవన్ వెనుదిరిగి చూడలేదని మనోహర్ కొనియాడారు.