Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని’ మనోహర్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచి సందేశం వెళ్తుందన్నారు. జమిలి ఎన్నికలు పాత విషయమేనని.. గతంలోనూ లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయన్నారు.జనసేన పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా దాని వెనుక జనహితం కచ్చితంగా ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిండు మనసుతో దాన్ని పాటిస్తారని.. ఆయన పాటించడమే కాదు.. నాయకులు, కార్యకర్తలకు సైతం ఆచరించేలా చూస్తారని వివరించారు. సెప్టెంబరు 2వ తేదీ జనసేన అధ్యక్షులు జన్మదినం సందర్భంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని మనోహర్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ కి నచ్చే విధంగా, ఆయన ఆలోచనలకు తగినట్లుగా ఈసారి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తామన్నారు నాదెండ్ల. దీనికోసం మొత్తం 5 కార్యక్రమాలను చేయాలని భావిస్తున్నట్లు.. మొదటిగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తామని ఆయన తెలిపారు. దీనిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులతో కలిసి భోజనాలు చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టినపుడు వారి కోసం కవాతు చేసి, అండగ నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఆకలితో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అయిదు రోజుల పాటు అప్పట్లోనే శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదానం నిర్వహించామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల మధ్య జనసేనాని జన్మదిన వేడుకలు చేసుకోవడం ఓ గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని మనోహర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
త్వరలోనే నాలుగో విడత వారాహి యాత్ర..
వారాహి విజయ యాత్ర నాలుగో దశపై 15 రోజుల తర్వాత పార్టీ నాయకులతో సమావేశం ఉంటుందని మనోహర్ వెల్లడించారు. ఎక్కడ… ఎప్పుడు అనేది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పొత్తుల గురించి సరైన సమయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని.. ఎన్నికల తేదీ పైన స్పష్టత వచ్చాక దీనిపై ముందుకు వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసేలా జనసేన అధినేత నిర్ణయాలు ఉంటాయని మనోహర్ స్పష్టం చేశారు.