తిరుమల తిరుపతి పవిత్రతను జనసేన కాపాడుతుంది: నాగబాబు

Janasena:వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అక్రమంగా దోచుకున్నదంతా జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకుల ధన దాహానికి అపవిత్రమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలను జనసేన పాలనలో సరిదిద్దుతామని వెల్లడించారు. స్వార్థపరమైన జీ.ఓ.లు, ఏకపక్ష నిర్ణయాలపై పునః పరిశీలన చేపడతామని అన్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో బుధవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం అనేక మందికి అన్నం పెడుతున్న ధార్మిక సంస్థ అనే విషయం వైసీపీ నాయకులు మర్చిపోయి కేవలం వారి జేబులు నింపే ఖజానా పెట్టెగా చూస్తున్నారని అన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అందిస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతిలో కొంతమంది వైసీపీ నాయకులకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ పనులను కూడా సమీక్షిస్తామని అన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే భారతదేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణగా అభివర్ణించే కీర్తి నుంచి ప్రస్తుతం ఆంధ్ర నుండి అశేష భారతీయులకు గంజాయి రవాణా చేసే రాష్ట్రంగా అపకీర్తి మూట కట్టుకుంటున్నామని అన్నారు. 

వైసీపీ పాలనలో తిరుమల కొండపై కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని  నాగబాబు సూచించారు. శెట్టిపల్లి ప్రజలు అనాదిగా సేద్యం చేసుకుంటున్న దాదాపు 350 ఎకరాలు గతంలో అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయానా శెట్టిపల్లిలో పర్యటించి కాపాడిన భూములను మళ్ళీ ఇప్పుడు వైసీపీ నాయకులు దోచుకోవాలని చూడడం దుర్మార్గమని, జనసేన ప్రభుత్వంలో శెట్టిపల్లి భూములకు శాశ్వత పరిష్కారం చేపడతామని అన్నారు. మఠం భూముల సమస్య కూడా జనసేన పరిశీలనలో ఉందని తేల్చిచెప్పారు. తిరుమలలో ఉద్యోగాలు అమ్ముకునే స్థితికి వైసీపీ నాయకులు వచ్చారని, జనసేన ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, పక్క గృహాల నిర్మాణం కోసం పరిశీలిస్తామని అన్నారు. జనసేనకు బలమైన పట్టు ఉన్న తిరుపతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో జనసేన నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole