మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist)

బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌

‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు..

నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో రాసిన వ్యాసంలో ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అంటే ఏమిటి? తాగుబోతులు ఎవరు? తాగుతూ తూలుతూ గృహహింసకు, బహిరంగ హింసకు ఎవరు పాల్పడతారు? ఒళ్లు మరిచిపోకుండా, బుర్ర ఆరోగ్యకరంగా పనిచేసేలా మద్యం తాగడం సమాజానికి నష్టం ఎందుకు కాదు? వంటి విషయాలను చర్చిస్తూ ఈ వ్యాసం రాశారు. దిల్లీకి చెందిన ప్రపంచప్రఖ్యాత సామాజిక శాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్(సీఎస్‌ డీఎస్‌) లో ఆమె అధ్యాపకురాలు. 2014 లోక్‌ సభ ఎన్నికలకు ముందు మధు కిష్వర్‌ తోటి పంజాబీ జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ తో పాటు కాంగ్రెస్‌–యూపీఏ ఓటమిని కోరుకుంటూ, నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. 2002 గుజరాత్‌ అల్లర్లలో సీఎం మోదీ పాత్ర ఏమీ లేదనీ, విశ్వహిందూ పరిషత్‌ అప్పటి అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగడియా వంటి హిందుత్వ గుజరాతీ పటేళ్లదే ముస్లింల ఊచకోత పాపమని ఆమె నమ్మారు. ఈ మేరకు ఆమె అనేక పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రాశారు.

ప్రియాంకా వాడ్రా మితిమీరిన స్థాయిలో ఆల్కాహాలు తాగుతుందన్న డా. స్వామి

2014 లోక్‌ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఉద్యమించి బీజేపీకి గట్టి మద్దతు పలికారు డా.సుబ్రమణ్యం స్వామి. నోటి దురుసు, పదును ఉన్న డా.స్వామి నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాడ్రాపై విరుకుపడ్డారు. గుజరాత్‌ లోని వడోదరాతో పాటు యూపీలోని వారాణాసి నుంచి కూడా పోటీచేసిన నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక తలపడతారని వార్తలొచ్చాయి అప్పట్లో. దీనిపై స్పందిస్తూ, ‘నిజంగా ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే జనం ఆమెను వెంటపడి కొడతారు. ఎందుకంటే ప్రియాంక ఆల్కాహాలు తాగుడు చాలా ఎక్కువ. చెడ్డపేరు కూడా ఉంది,’ అని సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యానించారు. దీనిపై మధు కిష్వర్‌ స్పందిస్తూ, ‘‘ఆల్కాహాల్‌ తాగడం వేరు. తాగుబోతుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించడం వేరు. ప్రియాంకను డా.స్వామి తాగుబోతు అని వర్ణించారు,’’అంటూ ట్వీట్‌ చేశారు. నేను మొదట చెప్పిన వ్యాసంలో కూడా మధు కిష్వర్‌ –కాళ్లపై మిగతా శరీరం, భుజాల మధ్యన తల నిటారుగా నిలబడేలా చూసుకుని మద్య తాగితే తప్పేలేదని అభిప్రాయపడ్డారు. హింస, దౌర్జన్యం, అడ్డగోలు ప్రవర్తనకు ఆస్కారం లేని తాగుడు మంచిదేనని, ఈ తాగుడు బాధ్యతాయుతమైనదని కిష్వర్‌ అన్నారు. మరి కర్నూలు జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి తాత (తల్లి తండ్రి) ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు కేవీ రెడ్డి అని చదివాను. అలాగే ఆయన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ, బళ్లారి విజయగనగర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశాడని కూడా తెలిసింది. ఈ లెక్కన ఈ రాయలసీమ మంత్రి గారికి మధు కిష్వర్‌ కు ఉన్నంతటి సామాజిక చైతన్యం, న్యూఢిల్లీలో నివసించిన నేపథ్యం లేకపోయినాగాని ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్‌’ అంటే ఏమిటో కొంతైనా తెలుసని అనుకోవచ్చు.