కాపుల ప్రయోజనాలు కాపాడే ‘కాపయ్య నాయకులు’ ఏపీలో ఉన్నారు!

Nancharaiah merugumala senior journalist: ఆంధ్రప్రదేశ్‌ లో విశాల కాపు సముదాయం ప్రయోజనాలు కాపాడడానికి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామజోగయ్య గారు, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు అవసరమైనప్పుడల్లా మీడియా ప్రకటనలు, బహిరంగ లేఖల ద్వారా తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల జనాభాతో పోల్చితే కనీసం పది రెట్లు ఎక్కువ జనాభాతోపాటు వందకు పైగా కులాలున్న ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు పరిరక్షించడానికి పైన చెప్పిన ముగ్గురు కాపు మహానేతల వంటి ఒక్క బీసీ నాయకుడూ లేడు. కనీసం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి బొత్స సత్యనారాయణ రావు వంటి తూరుపు కాపు నేతల స్థాయివారు ఒక్కరూ బీసీల్లో లేరు. కాపుల జనాభా ఎంతో తెలియదు గాని వారి జనాభాతో పోల్చినప్పుడు వారి ప్రయోజనాల కోసం ప్రకటనల యుద్ధం చేసే పేర్ని నాని, ఆళ్ల నాని, అంబటి రాంబాబు, ముత్తంశెట్టి ‘అవంతి’ శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, ఆచంట కృష్ణమోహన్, నిమ్మకాయల చినరాజప్ప వంటి లెక్కకు మించిన కాపు నాయకులు ఉన్నారు. కేవలం ఉత్తరాలు, ప్రకటనల యుద్ధాలు, టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా నిరంతరం కాపులకు మేలు చేసే నాయకులు అన్ని రాజకీయపక్షాల నుంచీ పనిచేయడం కాపు సముదాయం అదృష్టమనేది తెలుగు సామాజికశాస్థ్రవేత్తల నిశ్చితాభిప్రాయం. నిరంతరం కాపులు గురించి, వారి రాజకీయ, సామాజిక ఆర్థిక ప్రయోజనాల గురించి ఆవేశంతో, పదునుగా ప్రకటనల యుద్ధం చేసే కాపు నాయకులు క్రియాశీలంగా, చలనశీలతో ముందుకు సాగడం నిజంగా ఆరు కోట్ల ఆంధ్రులకు శుభసూచకం. ముద్రగడ వంటి నాయకులు ఏడాదికి ఒక్కసారి ఉత్తరం రాసినా కాపులకు మేలే జరుగుతుంది. ఏపీలో నిరంతర కాపుల సంతృప్తే సకల ఆంధ్రులకు శాంతి, సౌఖ్యాలు సమకూర్చుతుంది.

Optimized by Optimole