Karimnagar: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడానికి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని హుజరాబాద్ పట్టణ ,రూరల్, కమలాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట రూరల్ మండలాల్లో గంగాడి కృష్ణారెడ్డి పర్యటించి సభ్యత్వ నమోదుపై స్థానిక బిజెపి శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని.. కార్యకర్తల శ్రమతోనే నేడు బిజెపి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉందన్నారు. గతంలో కమ్యూనిస్టు చైనా పార్టీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం ఉంటే దాన్ని అధిగమించి నేడు భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది కార్యకర్తల బలంతో ప్రధమ స్థానానికి చేరుకుందన్నారు. ఇటీవల ప్రారంభించిన సభ్యత్వ నమోదులో దేశవ్యాప్తంగా కొత్తగా రెండు కోట్ల మంది నూతన సభ్యత్వాలు స్వీకరించారన్నారు. దేశ సంక్షేమం అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని , అందుకే ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని , బిజెపిలో చేరడానికి దేశవ్యాప్తంగా అనేక మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గల్లీ నుండి మొదలుకొని ఢిల్లీ వరకు పార్టీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు కోసం తగిన కసరత్తు చేసిందని, అందులో భాగంగానే బిజెపి శ్రేణులంతా సభ్యత్వ నమోదుపై తగిన దృష్టి సారించి ముందు కొనసాగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులంతా తగిన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను సభ్యత్వ నమోదులో నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి పార్టీ శ్రేణులంతా మరింత కష్టపడాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.