Ekdin pratidinmovie:
Camp Sasi గారు FB వాడుతున్న టైంలో ఒక పోస్ట్ రాశారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. “ఫైట్స్, డ్యాన్స్ సీక్వెన్స్ ఎవరైనా తీస్తారు. దర్శకుడి ప్రతిభ బయటపడేది Emotional Scenesలోనే. ఆ సన్నివేశాల్లో కెమెరా ఎక్కడ ఉంది, ఎడిటింగ్ ఎలా చేశారు, ఒకరు డైలాగ్ చెప్తుంటే మిగిలినవారి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, రీరికార్డింగ్ ఎలా ఉంది.. ఇవన్నీ చాలా కీలకం. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు” అని రాశారు.
ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఆ మాటలే గుర్తొచ్చాయి. ‘ఏక్‌దిన్ ప్రతిదిన్’ అనే ఈ బెంగాలీ సినిమా తీసింది దిగ్దర్శకుడు మృణాల్‌సేన్. తెలుగులో ‘ఒక ఊరి కథ’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన వ్యక్తి. 1979లో విడుదలైన ఈ సినిమా ఇవాళ చూస్తే నిన్నా మొన్నా తీసినట్టే ఉంటుంది. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, రీరికార్డింగ్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి అనిపిస్తుంది. ఏంటి కథ? రోజూ పొద్దున్న ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం ఐదున్నరకల్లా ఇంటికి వచ్చే ఓ అమ్మాయి ఆరోజు ఎంతసేపటికీ రాలేదు. దానికి ఆమె కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న సమాజం ఎలా స్పందించింది అనేదే కథ.
కథ ఇంత సింపుల్‌గా తేల్చేస్తే సినిమానే లేదు. ఈ కథ వెనకాల అనేక సామాజిక, రాజకీయ కోణాలను ముడిపెట్టారు మృణాల్. 1970 దశకంలో జనం పల్లెలను విడిచి పట్టణాలకు చేరడం అధికమైంది. దొరికిన ఇరుకు ఇళ్లల్లో సర్దుకుంటూ బొటాబొటి జీవితం సాధారణమైపోయింది. ఇంట్లో ఒకరు ఉద్యోగం చేస్తే మిగిలినవారు కడుపు నింపుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఉద్యోగం చేయడానికి వెళ్లి తిరిగి రాకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? చుట్టూ సమాజం చూసే చూపు ఎటువంటిది? ఇది Universal Point. ఏ భాషలో, ఏ ప్రాంతంలో తీసినా జనానికి దగ్గరయ్యే అంశం. దాన్ని 43 ఏళ్ల ముందే కనిపెట్టిన తెరకెక్కించిన ఘనత మృణాల్‌సేన్‌కు ఇవ్వాలి.
ఈ సినిమా మొదలవడం మామూలుగా మొదలైనా కాసేపటికి కథ అర్థమై మనం అందులో లీనమైపోతాం. మృణాల్ ఎంత పటిష్టమైన స్క్రీన్ ప్లే రాశారంటే, కాసేపటికి ఆ ఇంట్లో మనమూ ఒకరమైపోయి, ఆ అమ్మాయి త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు అనుకుంటాం. ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెడతాం. అసలు నిజంగా ఆ అమ్మాయి ఉందా, లేక ఇదంతా ఈ కుటుంబ సభ్యుల భ్రమా అని కూడా అనిపిస్తుంది. Psychological Dramaకి సరైన ఉదాహరణగా నిలిచే సినిమా ఇది.
ఒక ఇంట్లో ఎవరైనా తప్పిపోతే ఆ ఇంట్లో వాళ్లు ఆ రాత్రికి అన్నం తింటారా, నిద్రపోతారా అనేది నాకెప్పుడూ కలిగే దుర్మార్గమైన సందేహం. అటువంటి సంఘటన మన ఎదురింట్లో జరిగితే ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. దీన్ని అర్థవంతంగా చూపించారు ఈ సినిమాలో. రాత్రి అయినా అమ్మాయి ఇంటికి రాలేదు అనగానే ‘ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుంది’ అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. గుసగుసలు మొదలవుతాయి. చిలువలు పలువలుగా మారతాయి. ఆ సంకట స్థితిలో జరిగే సన్నివేశాలు మీరు చూసి తీరాలి. కెమెరా పనితనం, ఎడిటింగ్, రీరికార్డింగ్ అన్నీ మనలో ఎమోషన్‌ని పెంచేస్తాయి.
1979లో ఈ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ దర్శకుడిగా మృణాల్‌సేన్ పురస్కారం అందుకున్నారు. సినిమాకు ఎడిటింగ్ చేసిన గంగాధర్ నస్కర్‌కూ జాతీయ పురస్కారం లభించింది. ఇద్దరికీ దక్కిన సముచిత గౌరవం అది. 1980లో జరిగిన Cannes Film Festivalలోనూ ఈ సినిమాను ప్రదర్శించారు.
సినిమా Amazon Primeలో English Subtitlesతో అందుబాటులో ఉంది.