Nancharaiah merugumala senior journalist:
సరిగ్గా 132 సంవత్సరాల క్రితం జన్మించిన భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి డా.భీంరావ్ అంబేడ్కర్ (1891–1956) జీవించింది 65 సంవత్సరాల 7 నెలల 22 రోజులు అనే విషయం ఈరోజే గమనించాను. అంబేడ్కర్ 70–80 ఏళ్లు బతకలేదని తెలుసుగాని 66 ఏళ్ల లోపే కన్నుమూసిన విషయం గుర్తులేదు. రాజకీయ నాయకులు, సినిమా నటీనటుల వయసులు చాలా వరకు గుర్తుపెట్టుకుని చెప్పే అలవాటున్నా బాబాసాహబ్ ఎన్ని సంవత్సరాలు జీవించిందీ వెంటనే గుర్తుకు రాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన నెల రోజులకే ఆయన మరణించారనే వాస్తవం తెలుసుగాని ఏడు పదులు నిండకుండానే కన్నుమూశారనేది ఎందుకనో మనసులో రిజిస్టర్ కాలేదు. భారతదేశంలో బడుగువర్గాల విముక్తికి వారిలో చైతన్యం నింపిన భీంరావ్ మాదిరిగానే– ప్రపంచ శ్రామికుల జీవితాలను కొత్త మలుపు తిప్పడానికి మార్గం చూపించిన రాజకీయ తత్తవేత్త కారల్ మార్క్స్. ఈ జర్మన్ మేధావి కూడా ఈ నేలపై బతికింది 64 సంవత్సరాల 10 నెలల 4 రోజులే. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన మరో జర్మన్ సోషలిస్టు ఫ్రెడరిక్ ఏంగెల్జ్ (1820–1895) తో కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసిన మార్క్స్ 19వ శతాబ్దం ఆరంభంలో పుట్టి, చివరి సంవత్సరాల్లో (1818–1883) కన్నుమూశారు. నాటి ప్రష్యాలో జన్మించిన మార్స్స్ మూడు జర్మన్ యూనివర్సిటీల్లో (బాన్, బెర్లిన్, జెనా యూనివర్సిటీలు) డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ చదువులు పూర్తిచేసుకుని పారిస్ మీదుగా లండన్ వచ్చి స్థిరపడ్డారు. బ్రిటిష్ లైబ్రరీయే (అప్పుడు బ్రిటిష్ మ్యూజియం) మార్క్స్‌కు చివరి విశ్వవిద్యాలయంగా ఉపయోగపడింది. 1849 నుంచి మరణించే వరకూ లండన్ నగరమే మార్క్స్‌కు ఆశ్రయం ఇచ్చింది.
అంబేడ్కర్ న్యూయార్క్ చదువుల తర్వాతే లండన్ వర్సిటీలో అధ్యయనం..
బొంబాయి యూనిర్సిటీ తర్వాత అంబేడ్కర్ 22 ఏళ్ల వయసులో ఓడలో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా నగరం న్యూయార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అక్కడ ఉన్నత చదువులు, అధ్యయనం తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్ అనుబంధ సంస్థ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎలెస్యీ)లో పరిశోధన, అధ్యయనం చేశారు. లండన్ సమీపంలోని గ్రేస్ ఇన్ లో న్యాయశాస్త్రం (బారెట్ లా) పూర్తిచేశారు. 1913 నుంచి 1923 వరకూ అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం ఇలా రెండు అంతర్జాతీయ నగరాల్లో సాగింది. 20వ శతాబ్దంలో కోట్లాది మంది ప్రపంచ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కారల్ మార్క్స్, బీఆర్ అంబేడ్కర్ లకు లండన్ నగరమే అధ్యయన, పరిశోధనా కేంద్రం, కార్యక్షేత్రం కావడంలో విశేషమేమీ లేదంటారు. అయితే, కులం, సామాజిక వివక్ష, పౌరహక్కులు, ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలక అధ్యయనం అంబేడ్కర్– కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభించి చాలా వరకు కొనసాగించారు. అక్కడే ఆయన పరిశోధనకు గట్టి పునాది పడిందని చెబుతారు. లండన్ వచ్చేనాటికే ఆయన సామాజికశాస్త్రం, ఆంథ్రోపాలజీ, రాజనీతి, అర్థశాస్త్రంలో పూర్తి పట్టు సంపాదించారు. మార్క్స్, భీంరావ్–ఇద్దరూ ఆరున్నర దశాబ్దాల కాలమే జీవించి ఈ లోకం విడిచి వెళ్లిపోవడం తీరని లోటు. వారి రచనలే మానవాళికి దిక్చూచిలా పనిచేస్తున్నాయి.