టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజాచిత్రం శాకుంతలం. గత ఏడాది ఆమె నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించిన సమంత.. శాకుంతలంతో సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు అపూర్వ స్పందన లభించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాకుంతలం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ సమంత ఆశలు నెరవేరాయా? సినీ అభిమానుల అంచనాలను ఈమూవీ అందుకుందా? గుణశేఖర్- సమంత కాంబో సక్సెస్ కొట్టినట్లేనా?
కథ..
ఇంద్రుని ఆదేశాలతో భూలోకానికి వచ్చిన అప్సరస మేనక.. తన అందాచందాలతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రున్ని లొంగదీసుకుంటుంది. ఇద్దరు శారీరకంగా దగ్గరవడంతో మేనక ఓఆడబిడ్డకు(శాకుంతల) జన్మినిస్తుంది. నరుడివల్ల కలిగిన ఆసంతానానికి దేవలోకంలో ప్రవేశం లేకపోవడంతో భూలోకంలోనే వదిలి స్వర్గానికి వెళ్లిపోతుంది. పక్షుల గుంపు ఆపాపను మాలినీ తీరాన ఉన్న కణ్వాశ్రమ ప్రాంతంలో విడిచివెళ్లిపోతుంది. కణ్వమహర్షి(సచిన్ ఖేడేకర్) ఆపాపను దైవ ప్రసాదంగా భావించి శాకుంతల నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఓరోజు దుష్యంతుడు(దేశ్ మోహన్) వేటకు వెళ్లినప్పుడు కణ్వమహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆశ్రమంలో శకుంతలను చూసి తొలిచూపులోనే మనసుపారేసుకుంటాడు. శకుంతల కూడా దుష్యంతుడు నచ్చడంతో.. ఇద్దరు కలిసి గాంధర్వ వివాహం చేసుకుని ఒకటవుతారు. ఆతర్వాత వీరిద్దరి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి?
శకుంతలకు దుష్యంతుడు ఎందుకు దూరమవుతాడు? వీరు వీడిపోవడానికి దుర్వాస మహామునికి ఉన్న సంబంధం ఏమిటి? చివరకు వీళ్ల కథ సుఖాంతం అవుతుందా? అన్నది తెలియాలంటే వెండితెరపై సినిమాను చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
భారతీయ సాహిత్యంలో ఉన్న శకుంతల -దుష్యంతుల ప్రేమకావ్యం అందరీకి సుపరిచితమే. ఈకథకు తనదైన శైలిలో మేళవింపులు జోడించి తెరపై అద్భుతమైన దృశ్యం కావ్యంలా తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు గుణశేఖర్. కథలో వైవిధ్యం లోపించడం, నాసిరకమైన త్రీడి హంగులు, నత్తనడకనసాగే కథనం ప్రేక్షకుడికి చిరాకుతెప్పిస్తాయి. శకుంతల – దుష్యంతుడి మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే ఉన్నా..వాళ్ల కెమిస్ట్రీ అంతగా పండలేదు. ఇంటర్వెల్ కి ముందు దుర్వాస మహర్షీ ఎంట్రీ అదిరింది. అక్కడి నుంచి సినిమా మరో లెవల్ కి వెళుతుంది.స్టైలిష్ స్టార్ తనయ అల్లు అర్హ ఎంట్రీ అదిరింది. దుష్యంతుడితో ఆమె వాదన ఇంట్రెస్టిగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ సోసో అనిపించినా.. సెకాండాఫ్ కొంతలో కొంత ఫర్వాలేదు.
ఎవరెలా చేశారంటే?
శకుంతల పాత్రకోసం సమంత కష్టపడిన తీరు మెచ్చుకోవాల్సిందే. అయినా ఆపాత్రకు ఆమె అంతగా సెట్ అవలేదనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం సమంత అదరగొట్టేసింది. సొంత డబ్బింగ్ ఫర్వాలేదు. ఇక దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ ఉన్నంతలో న్యాయం చేశాడు.దుర్వాస మహామునిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు పూర్తి న్యాయంచేశాడు. సినిమాకు ఆయన పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. మిగతా నటీనటుల విషయానికొస్తే.. అనన్య , మధుబాల సచిన్ తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక పనితీరు..
శంకుతల- దుష్యంతుల ప్రేమకావ్యాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలచడంలో దర్శకుడు గుణశేఖర్ కొంతమేర విజయం సాధించారు. మణిశర్మ సంగీతం సినిమాకు మేజర్ ఎసెట్. నేపథ్య సంగీతం అద్భుతం. నిర్మాణవిలువలు బాగున్నాయి.
“చివరగా అంతగా ఆకట్టుకోని శాకుంతలం”
రివ్యూ : 2.5/ 5