“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్”
అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తి చేసుకున్న అనంతరం విరాటపర్వం.. ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేనమీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వర్థామ వంటి హేమాహేమీలను మట్టి కరిపించి.. పాండవ మధ్యముడు జయభేరీ మోగించాడు.
సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజకీయ పరిస్థితులు తలెత్తాయి. దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి గాండీవధారిగా.. శత్రు నిర్జనుడిగా.. భట్టి విక్రమార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే రథానికి పాదయాత్ర అనే జవనాశ్వాన్ని కట్టి.. మందికి వందకు పైగానున్న బీఆర్ఎస్ అనే కౌరవ పక్షంపై దేవదత్తంతో సమరశంఖం పూరించాడు.
కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలనే, తన అక్షయ తూణీరంలో తరిగిపోని అమ్ములుగా మలచుకుని.. ప్రజా క్షేత్రంలో శరపరంపరగా వదులుతున్నాడు. భట్టి విక్రమార్క ప్రశ్నల ధాటికి.. మాటల మాంత్రికుడని పేరొందిన కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరుల వద్ద సమాధానాలే లేకుండా పోయాయి.
అధికార పక్షాన్ని మాటల ధాటికి, ప్రశ్నల వేడికి కకావికలు చేస్తూనే.. సొంత కాంగ్రెస్ సైన్యాన్ని ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనలో ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తూనే.. మరోసారి అధికారమిస్తే.. ఏమేమి చేస్తామో ప్రజలకు వివరిస్తూ.. ఎన్నికల సమరంలో పార్టీ గెలుపుకు భట్టి విక్రమార్క నాందీప్రస్తావన చేస్తున్నాడు.
ఎన్నికల రణక్షేత్రంలో తిరుగులేని అస్త్రంగా నిలిచే పాదయాత్రనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుని.. బోథ్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నాడు. ప్రతికూల వాతారణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనక్షేమమే సంకల్పంగా.. సాగుతున్నాడు.
కాంగ్రెస్ రథాన్ని జనామోదంతో గెలుపు తీరాలకు చేర్చి.. ప్రజాసంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టాలన్నదే ఏకైక లక్ష్యంగా భట్టి పాదయాత్ర జవనాశ్వం వేగంగా పరుగులు తీస్తోంది. అర్జునుడి ఉత్తర గోగ్రహణ విజయం కురుక్షేత్ర గెలుపుకు సంకేతమైతే.. భట్టి పాదయాత్ర 2023 గెలుపుకు తిరుగులేని సంకేతంగా నిలుస్తోంది.
============
సీఎస్( సీనియర్ జర్నలిస్ట్)