Karnataka: హంగ్ ‘ కింగ్ ‘ కుమార స్వామి..

Karnataka elections2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల(మే)లో జరగనున్నాయి.  అధికారంలో నిలబెట్టుకోవాలని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ .. హంగ్ వస్తే కింగ్ మేకర్ తామేనని  జేడిఎస్ పార్టీలు ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని  తగ్గేదేలా తరహాలో  నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన పలు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని.. గత ఎన్నికల మాదిరి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే  అవకాశం లేదని తేలింది.

మరోవైపు ఎన్నికల  ఫలితాల అనంతరం బీజేపీ, అయినా కాంగ్రెస్‌ అయినా కచ్చితంగా మామీదే ఆధారపడాల్సి వస్తుందని.. ఇప్పటికే ఆ పార్టీలు మా అభ్యర్థులతో బేరసారాలు మొదలుపెట్టాయని.. జేడీ(ఎస్‌) చీఫ్‌ హెచ్‌.డీ.కుమారస్వామి వ్యాఖ్యానించడం కర్ణాటకలో ఆ పార్టీ పోషించే క్రియాశీల పాత్రను తెలియజేస్తున్నాయి. అత్తెసరు సీట్లతో అధికారం చేపట్టడం అలవాటుపడిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్‌) రాష్ట్రంలో ప్రధాన పార్టీలను హడలెత్తిస్తోంది. మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవగౌడ ప్రారంభించిన జేడీ(ఎస్‌)ను ఆయన కుమారుడు కుమారస్వామి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు నడిపిస్తున్నారు. కుమారస్వామి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు పార్టీలో అంతర్గత పోరును కూడా ఎప్పటికప్పుడు అణిచివేస్తున్నారు. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి కుమారస్వామి ప్రమేయం లేకుండా అధికారం చేపట్టాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముందుకెళ్తుంటే, 30-40 సీట్లను గెలుచుకుంటే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చనే ఆశావహదృక్పథంతో కుమారస్వామి ప్రణాళికలు రచిస్తున్నారు.

“కర్ణాకటలో ఇటీవల పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వేలో మరోమారు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవచ్చని వెల్లడయ్యింది. కాంగ్రెస్‌ 98, బీజేపీ 92 స్థానాలు గెలిచే అవకాశాలుండగా, జేడీ(ఎస్‌) 25-30 స్థానాలు పొంది మరోమారు కింగ్‌మేకర్‌ కానుందని ఈ సర్వేలో తేలింది”

 సీఎం పీఠంపై కుమారస్వామి కన్ను..

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి జేడీ(ఎస్‌) పార్టీకి కలిసివస్తోంది. 2004 ఎన్నికల్లో 58 స్థానాలు, 2018 ఎన్నికల్లో 37 స్థానాలు గెలిచి మూడో స్థానంలో నిలిచిన జేడీ (ఎస్‌) 2006లో, 2018లో కుమారస్వామి సీఎంగా రెండుసార్లు అధికార పగ్గాలు అందుకుంది. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి పూర్తిస్థాయిలో అధికారంలో ఉండలేకపోయారు. గత ఇరవై ఏళ్ల చరిత్రలో 2004లో గెలిచిన 58 స్థానాలే జేడీ(ఎస్‌)కు అధిక స్థానాలు కావడం గమనార్హం. రాష్ట్రంలో 15 శాతం ఓట్లున్న వొక్కలిగ సామాజిక వర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న జేడీ(ఎస్‌)కు మైసూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి పట్టుంది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 37 స్థానాల్లో 29 ఆ ప్రాంతాలలోనే సాధించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని అంచనా వేస్తున్న కుమారస్వామి 40 సీట్లు గెలిస్తే చాలు, తానే కాబోయే ముఖ్యమంత్రిని అనే ధీమాతో ఉన్నారు. ఆ నమ్మకంతో ఆయన మైసూర్‌ ప్రాంతంలో, వొక్కలిగ వర్గంలో తమ పట్టును సడలకుండా చూసుకుంటూనే ఇతర అవకాశాలపై కూడా దృష్టి సారించారు. ‘పంచరత్న’ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలలో టికెట్లు రాని రెబల్స్‌ను జెడీ (ఎస్‌) తరఫున బరిలోకి దింపారు. పార్టీలు మారుతున్న వారిలో మాజీ సీఎం యడియూరప్ప మేనల్లుడు కూడా ఉన్నారంటే జేడీ(ఎస్‌) చేరికలపై ఎంత సీరియస్‌గా ఉందో తెలుస్తోంది. రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించే లింగాయత్‌ సామాజిక వర్గంలో కూడా పట్టు సాధించేందుకు కుమారస్వామి వారికి 41 స్థానాలు కేటాయించారు. 2018లో లింగాయత్‌లకు 30 స్థానాలిచ్చిన జేడీ(ఎస్‌) ఈసారి 11 స్థానాలు అధికంగా కేటాయించడం విశేషం. పార్టీకి బలం లేని స్థానాల్లో బలహీన అభ్యర్థులను దింపి ఇతర పార్టీలకు పరోక్షంగా సహకరిస్తుందనే విమర్శలను తిప్పికొట్టేలా ఈ సారి జేడీ(ఎస్‌) బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. దీనికి ఉదాహరణగా మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గమే. సిద్ధరామయ్యకు పోటీగా జేడీ(ఎస్‌) ప్రకటించిన అభ్యర్థి అదృశ్యం కావడంతో కుట్రను ముందే పసిగట్టిన కుమారస్వామి హుటాహుటిన మరో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి పార్టీపై దుష్ప్రచారం జరగకుండా జాగ్రత్తపడ్డారు. పార్టీకి పట్టులేకపోయినా బలమైన అభ్యర్థులను పోటీ చేయించి తక్కువ మెజార్టీతోనైనా అధిక స్థానాలు గెలిచి మరోమారు ముఖ్యమంత్రి కావాలని కుమారస్వామి రాజకీయ ఎత్తులేస్తున్నారు.

 

జేడీఎస్ లో ఇంటిపోరు..

జనతాదళ్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య జనతాదళ్‌ నుండి విడిపోయి 1999లో కర్ణాటక కేంద్రంగా జనతాదళ్‌(సెక్కులర్‌) పార్టీని ఏర్పాటు చేశారు. జేడీ(ఎస్‌)లో దేవగౌడ తర్వాత స్థానం సిద్దరామయ్యకే ఉండేది. పార్టీలో కుటుంబ జోక్యం పెరిగిపోయిందని, ఇతరులకు ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపిస్తూ దేవగౌడ్‌, కుమారస్వామిలతో విభేదించిన సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పంచన చేరి, 2013లో కాంగ్రెస్‌ నుండి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడడంతో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ అధిష్టానం జేడీ(ఎస్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిచ్చింది. దేవగౌడ కుటుంబంతో మొదటి నుండి విభేదించే సిద్ధరామయ్య అయిష్టంగానే కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పుకున్నారు. కుమారస్వామి నేతృత్వంలో 14 నెలలు కొనసాగిన ప్రభుత్వం రాజకీయ అనిశ్చితితో కుప్పకూలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి అసెంబ్లీలో బలం కోల్పోయారు. మొదటి నుండి కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సిద్ధరామయ్యే సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణమనే ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్‌లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు సిద్దరామయ్య అనుచరులే కావడం ఇక్కడ గమనార్హం. జేడీ(ఎస్‌)లో అంతర్గత కుమ్ములాటలు కూడా కుమారస్వామికి తలనొప్పిగా మారాయి. ప్రధానంగా దేవగౌడ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పార్టీకి నష్టం చేకూర్చాయి. దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తమ్ముడు కుమారస్వామిపై తిరుగుబాటు చేశారు. ఇప్పటికే దేవగౌడ కుటుంబం నుండి ఎనిమిది మంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో కుటుంబ సభ్యుల నుండి వస్తున్న డిమాండ్లు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని విస్మరించి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతిస్తే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని కుమారస్వామి చెబుతున్నా పార్టీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంటిపోరుతో ఇంటగెలిచి రచ్చలో గెలవడం కుమారస్వామికి పెద్ద సవాలే.

 

పొత్తులపై ఆచితూచి అడుగులు

ఎన్నికల్లో పొత్తులపై కుమారస్వామి ఆచితూచి అడుగులు వేసే వైఖరి తీసుకున్నారు. జేడీ(ఎస్‌) బీఆర్‌ఎస్‌తో, ఎంఐఎంతో పొత్తులు పెట్టుకుంటుందని ప్రచారం జరిగినా కుమారస్వామి తన వ్యూహాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే ఇతర స్థానాల్లో పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని ఆ ప్రతిపాదనలకు దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతోపాటు ఆ పార్టీ ఇతర కార్యక్రమాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన కుమారస్వామి పలుమార్లు కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌ బెంగుళూరు వెళ్లి దేవగౌడను కూడా కలుసుకున్నారు. కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల బరిలో ఉంటుందని స్వయానా కేసీఆర్‌ కుమారస్వామి సమక్షంలోనే హైదరాబాద్‌లో ప్రకటించారు. బీఆర్‌ఎస్‌తో లాభనష్టాలు భేరీజు వేసుకున్న కుమారస్వామి బెంగుళూరుకు చేరుకున్న వెంటనే రాష్ట్రంలో జేడీ(ఎస్‌) ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వారు సానుకూలంగా ఉండరనే భావనతో కుమారస్వామి బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్‌ బరిలో లేకపోయినా పరోక్షంగా కేసీఆర్‌ అండ్‌ టీం జేడీ(ఎస్‌)కు అన్నివిధాలా సహాయసహకారాలను అందిస్తుందని వస్తున్న వార్తలు కుమారస్వామి రాజకీయ చతురతకు నిదర్శనం.

రైతులకు దన్నుగా జేడీ(ఎస్‌) మ్యానిఫెస్టో

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఎదుర్కొనే లక్ష్యంగా రైతులకు దన్నుగా ఉండే మ్యానిఫెస్టోను కుమారస్వామి  నేతృత్వంలోని జేడీ(ఎస్‌) రూపొందించింది. సొంత భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి పది వేల రూపాయలు, రైతు కూలీలకు రెండు వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల కోసం ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పింది. రైతు కుటుంబానికి చెందిన అబ్బాయిలను వివాహమాడితే వధువుకు రెండు లక్షల రూపాయలిస్తామని ప్రకటించింది. వికలాంగులకు ఆసరాను రూ.600 నుండి రూ.2500, మహిళా ఫించన్లను రూ.600 నుండి రూ.2500 వరకు పెంచుతామని తెలిపింది. గర్భిణీలకు ఆరు నెలల పాటు నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం, అంగన్వాడీల జీతభత్యాల పెంపు వంటి ఆకర్షణీయ పథకాలను జేడీ(ఎస్‌) మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా ఉండాలని, జేడీ(ఎస్‌) సాధించే స్థానాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమై మరోసారి రాష్ట్రంలో కింగ్‌మేకర్‌ పాత్ర పోషించాలని ఆశిస్తున్న కుమారస్వామి ఆశలు నెరవేరుతాయో లేదా అడియాశలవుతాయో మే 13న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.

__________________

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

 

Optimized by Optimole