హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు రెండు రోజుల( రేపు , ఎల్లుండి) పాటు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఇక కవిత ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మమతా బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్పీ) వంటి నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీసీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇది కవిత వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని లెఫ్ట్ పార్టీ నాయకులతో సమావేశమై మద్దతును పొందిన కవిత, ఈ ఢిల్లీ పర్యటనతో ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చాలనుకుంటున్నారు. కవితతో పాటు ఇతర పార్టీలు, సంఘాలను కలుపుకొని ఢిల్లీ పర్యటన ఉంటుందా? లేక ఆమె ఒంటరిగా వెళ్లతారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
రైల్ రోకోకు ముందు భారీ బహిరంగ సభ
ఈ నెల 17న దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత, ఢిల్లీ పర్యటన అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. జాతీయస్థాయిలో పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభతో బీసీ ఉద్యమాన్ని కవిత తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.