నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!

నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!

కవీ!
నీ భావసంపదకు వందనాలు,
నీ ఊహశాల్యతకు నమస్సులు,
నీ కవితా పటిమకు నీరాజనాలు.
ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది.
సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో, శాస్త్ర విజ్ఞానంతో పని లేదు, పేచీ కూడా లేదంటాడీ కవివరుడు. మనస్పందన, తార్కిక వాదం రెండూ, రెండు తీరాల వంటివట భావనానందంతో పరవళ్లు తొక్కే నదికి. మేధో శక్తి ఎంతో పెరిగి శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నిస్తున్నా…. ఇంద్రియానుభూతి కేం లోటురాదంటాడు, చూడండి…
ఉ:
అందము అందమే మనకు అందిన
అందక పోయినన్, మన
స్పందన వేరు తార్కిక వివాదము
వేరవి రెండు భావనా
నంద నదీ తట ద్వయము నా
విలసిల్లును ఇంద్రియాను భూ
తీందిర పేదవోదు పడగెత్తిన
ధీ బలశాస్త్రమెంతయున్

దీన్ని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు కూడా! చంద్రుడొక ఉపగ్రహం. రాళ్లూ, రప్పలూ తప్ప…..తాగడానికి నీరు, పీల్చడాని గాలీ సహితం లేని ఓ పెద్ద గందరగోళమని తెలిసినా, శాస్త్రీయంగా అది దృవపడినా… రివ్వున వీచే చల్లగాలిలో ఓ రాత్రిపూట ఆకాశంలో వెన్నెలలీనే చంద్రబింబాన్ని చూసి చలించకుండా ఉండగలమా?
“…… రేల నబోంతరాల శశిరేఖల జూసి చలింపకుందుమే?”
అని ప్రశ్నిస్తాడు.
‘నన్నయ నుంచి నా వరకు…..’ అని పద్యాన్నే కాకుండా గద్యాన్ని, గేయాన్ని, కవితని, కథల్ని, కథానికల్నీ, ఇలా తెలుగునాట ఎన్నెన్నో సాహితీ ప్రక్రియల్ని సుసంపన్నం చేసి, పాతికకు పైగా పుస్తకాలు రాసిన ఆయన పరమపదించారు.
ఆయన నుంచి అపారమైన స్ఫూర్తినే కాదు, అవ్యాజమైన ప్రేమని, వాత్సల్యాన్నీ పొందినవాడిని నేను!
నిండు హృదయంతో
కవివరా నీకిదే నివాళి..

============

ఆర్. దిలీప్ రెడ్డి 

పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్