69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్‌ పరుగులు..

69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్‌ పరుగులు..

Nancharaiah merugumala: (senior journalist)

…………………………………………………………………….

ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాపు అన్ని వర్గాల నేతలు, ప్రజలు చెప్పారు. అయితే, కేసీఆర్‌ ఎన్నో జన్మదినమో ఎవ్వరూ ఈ పత్రికా ‘ప్రకటనల్లో’ వెల్లడించలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు దాదాపు మూడేళ్ల ముందు (1954 ఫిబ్రవరి 17) మెదక్‌ జిల్లాలో జన్మించిన చంద్రశేఖర్‌ రావు గారే తనది ఎన్నో పుట్టినరోజో చెప్పవద్దని తన పార్టీవారిని కోరారేమో తెలియదు. ఏమైతేనేం అప్రకటిత తెలంగాణ తండ్రి కల్వకుంట్ల వారు ఏడు పదులు నిండడానికి కేవలం ఏడాది దూరంలో ఉన్నారు. షెడ్యూలు ప్రకారం ప్రస్తుత తెలంగాణ రెండో శాసనసభ పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. అంటే నవంబర్‌–డిసెంబర్‌లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీఆరెస్‌ గెలిచి, ఒకవేళ కేసీఆరే ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్‌ నెలలో ప్రమాణం చేస్తే ఆయన 70వ పుట్టినరోజు వేడుక వచ్చే ఏడాది ఆయన సీఎం పదవిలో ఉండగానే జరుగుతుంది.

తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు (పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య) మాత్రమే. వారిలో ఒక్క వెంగళరావు గారు మాత్రమే నాలుగేళ్లకు పైగా సీఎం పీఠంపై కూర్చోగలిగారు. చెన్నారెడ్డి రెండుసార్లు చేసినా ఒక్కసారీ ముఖ్యమంత్రి కురిసీలో వరుసగా మూడేళ్లు లేరు. అలాంటిది జలగం వెంగళరావు గారి కులానికే (పద్మనాయక వెలమ) చెందిన కేసీఆర్‌ గారు హైదరాబాద్‌ నుంచి పరిపాలించిన తెలుగు ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీఎంగా ఉమ్మడి ఏపీలో ఓ రెడ్డి నేత కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లాకు చెందిన కాసు వరుసగా 7 సంవత్సరాల 221 రోజులు సీఎం గద్దెపై కొనసాగారు. ఆ తర్వాత ఓ కమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాసు రికార్డును పగలగొట్టి వరుసగా 8 ఏళ్ల 245 రోజులు హైటెక్‌ సీఎంగా పదవిలో కొనసాగి కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెడ్డి, కమ్మ సీఎంల రికార్డులు బద్దలుకొట్టి చరిత్ర తిరగరాసే అవకాశం తెలుగునాట ఒక్క కేసీఆర్‌ గారికే ఉన్నట్టు కనిపిస్తోంది.

కేసీఆర్‌ సీఎంగా మొదటిసారి 2014 జూన్‌ 2న, రెండోసారి 2019 డిసెంబర్‌ 13న ప్రమాణం చేశారు. ఈసారి డిసెంబర్‌ రెండో వారం వరకూ కేసీఆర్‌ పదవిలో ఉంటే ఆయన చంద్రబాబు గారి రికార్డును పగలగొట్టి అత్యధికాలం సీఎంగా హైదరాబాద్‌లో అధికారంలో ఉన్న నేతగా చరిత్రలో నిలిచిపోతారు. మూడోసారి కూడా ఆయన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే..అప్పుడు ఆయనే సీఎంగా ప్రమాణం చేస్తే ఆయన అనేక రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అప్రకటిత రెడ్డి బంధు పథకం చక్కగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా తెలంగాణ రెడ్డి జనసమూహానికి అవసర కాలంలో ఎలాంటి అసంతృప్తులూ లేవు. సబ్బండ వర్ణాలకూ ప్రజానాయకుడిగా నిరూపితమై నిరంతరం పనిచేస్తున్న పెద్ద పద్మనాయకుడు కేసీఆర్‌ గారి పాలనలో రెడ్లు ఎన్నడూ లేనంత సంతృప్త స్థాయిలో జీవిస్తున్నట్టు కనిపిస్తున్నారు. కమ్మ,రెడ్డి, వెలమ, కాపు సహిత ఆంధ్రోళ్లందరూ కేసీఆర్‌ కుటుంబానికి వ్యతిరేకం కాదని 2014 నుంచీ జరిగిన అనేక పరిణామాలు నిరూపించాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో జలగం వెంగళరావు గారి తర్వాత గొప్ప వెలమ పరిపాలనాదక్షుడిగా కేసీఆర్‌ పేరు తెలుగు జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి కులానికి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్‌ కొత్త రాష్ట్ర సచివాలయంలో అడుగుబెట్టే రోజులు 2047 తర్వాత పుష్కలంగా ఉంటాయని తెలంగాణ రాజకీయ పండితోత్తములు అంచనావేస్తున్నారు.