ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..

Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్‌ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది!

దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే కాంగ్రెస్‌ నేతల గుండెల్లో గుచ్చుకుంది. హిందుత్వ పార్టీ సర్కారు తాము ఆరాధించే కుటుంబ పెద్ద అయిన పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ పేరు తీసేయడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలో కొత్తదనం లేకున్నా కాస్త ఆసక్తికరంగా, చిన్నకారు చర్చకు దారితీసేలా కనిపిప్తోంది. ‘‘తమకంటూ సొంత చరిత్ర లేనివారు ఇతరుల చరిత్రను తుడిచేయడానికి తెగబడ్డారు,’’ అని మల్లికార్జున్‌ గారు ట్విటర్‌ ద్వారా తన నిరసన తెలిపారు. నిజమే, కాంగ్రెస్‌ పార్టీకే గొప్ప ‘ఘనీభవించిన’ చరిత్ర ఉంది. ఆరెసెస్‌–బీజేపీ నేతృత్వంలోని సంఘ్‌ పరివారానికి కాంగ్రెస్‌ పార్టీకున్న సుదీర్ఘ చరిత్ర లేనేలేదు. జాతీయ విముక్తి పోరాటంలోనూ హిందుత్వ పక్షాల పాత్ర నామమాత్రమే. అందుకే బీజేపీ, మోదీ ప్రభుత్వం–ఈ రెండూ 2014 నుంచీ భారతదేశంలో చరిత్ర సృష్టించే పవిత్ర కార్యం చేపట్టాయి. చరిత్ర లేని సంఘ పరివారానికి గుజరాత్‌ లో సరైన చరిత్ర అసలే లేని కులంలో, కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోదీ దొరకడంతో బీజేపీ ప్రభుత్వానికి ఇతరుల చరిత్ర తుడిచేసే పనిని పకడ్బందీగా, పదునుగా చేయడం సులువవుతోంది. చరిత్ర లేని బీజేపీకి, ప్రధాని మోదీకి కొత్త చరిత్ర అవసరం.

తొలి కాషాయ బ్రాహ్మణ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి జీ కూడా తన ఆరేళ్ల పాలనాకాలంలో తన కంటూ గొప్ప చరిత్ర సృష్టించే కోరికతో ఉన్నారుగాని, లోక్‌ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. వాజపేయి అసలు రూపాన్ని ఆయన కొత్త జీవిత చరిత్ర (వాజపేయి–ది అసెంట్‌ ఆఫ్‌ ద హిందూ రైట్‌) రాసిన అభిషేక్‌ చౌధరీ మాటల ద్వారా తెలుసుకునే సదవకాశం భారతీయులకు లభిస్తోంది. నరేంద్ర మోదీ పెళ్లి చేసుకుని భార్యకు దూరంగా బతుకుతుంటే, అటల్‌ బిహారీ జీ పెళ్లే లేకుండా ఒక కూతురుకు ఎలా తండ్రి అయినదీ, ఆ బిడ్డను ఎలా దత్తత తీసుకుని తాన అధికార నివాసంలో ఉండనిచ్చిందీ అభిషేక్‌ చౌధరీ పుస్తకం చదివి తెలుసుకోవచ్చట. ఈ లెక్కన బీజేపీకి, బీజేపీ అగ్రనేతలకూ కూడా మనకు తెలియని సొంత చరిత్రలు చాలా ఘనమైనవి ఉన్నాయన్న మాట.

Optimized by Optimole