Tirupati: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖకి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను మార్చి 24 నుంచి అనుమతించనున్నట్లు టీటీడి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడి ప్రకటనలో పేర్కొంది. దీంతో సిఫార్సు లేఖల విషయంలో మంత్రి కొండా సురేఖ జరిపిన సంప్రదింపులు ఎట్టకేలకు సత్ఫలితానిచ్చాయి.
కాగా ఇటీవల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతూ మంత్రి సురేఖ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. దీంతో ఆమె విజ్ఞప్తికి స్పందించిన ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరోవైపు టీటీడీ తాజా ఉత్తర్వులపై మంత్రి సురేఖ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆదివారం, సోమవారం మాత్రమే అనుమతిస్తున్నట్లు టీటీడి ప్రకటనలో పేర్కొంది. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు లేఖలను అనుమతిస్తామని స్పష్టం చేసింది. మిగతా రోజుల్లో ప్రజా ప్రతినిధుల ఒక లేఖను(6 గురు భక్తులను మించకుండా) స్వీకరిస్తామని టిటిడి ఉత్తర్వుల్లో వెల్లడించింది.