హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, అలాగే మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ సృజన ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు.
ప్రముఖ మార్గదర్శకాల ప్రకారం, అవసరమైతే ఎంపీటీసీలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సమీప ఎంపీటీసీలలో విలీనం చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) చట్టం ప్రకారం, ప్రతి మండల ప్రజా పరిషత్‌లో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండటం తప్పనిసరి. ఈ నిబంధనకు అనుగుణంగా, ఇప్పటికే ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో ప్రభావితమైన వాటిని పునర్విభజించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పలు గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడం, మరికొన్ని పరస్పరం విలీనం కావడం వంటి అంశాల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ అవసరమైందని అధికారులు వెల్లడించారు.
ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్:
ముసాయిదా ప్రచురణ: జూలై 8, 2025
అభ్యంతరాల స్వీకరణ: జూలై 8–9, 2025
అభ్యంతరాల పరిష్కారం: జూలై 10–11, 2025
తుది ప్రచురణ: జూలై 12, 2025